‘అత్యాచార నగరి’గా ఉద్యాన నగరి
సాక్షి, బెంగళూరు : అంతర్జాతీయ స్థాయిలో ఉద్యాననగరిగా ఖ్యాతిగాంచిన బెంగళూరు నగరం పాలకుల నిర్లక్ష్యం, పోలీసు శాఖ అలసత్వం కారణంగా ప్రస్తుతం అత్యాచార నగరిగా మారుతోందని చైల్డ్ రైట్స్ ఇన్సియేటివ్ ఫర్ షేర్డ్ పేరెంటింగ్ (సీఆర్ఐఎస్పీ-క్రిస్ప్) వ్యవస్థాపకులు కుమార్ జాగీర్దార్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరానికి చెందిన సుమంగళి సేవా ఆశ్రమ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో కలిసి మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నగరంలో ఎటు చూసినా అత్యాచారాల పర్వం నడుస్తోందని పేర్కొన్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2011-13 మధ్యలో దాదాపు 300 శాతం వరకు అత్యాచార ఘటనలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై సాగే అత్యాచారాల నిరోధానికి గాను పాఠశాల సమయాల్లో చిన్నారుల పూర్తి బాధ్యతను పాఠశాల యాజమాన్యాలే వహించేలా చట్టాలు తీసుకురావాలని అన్నారు. అంతేకాక పిల్లల ప్రయాణ సమయాల్లో సైతం పాఠశాల యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ప్రతి పాఠశాలలోనూ ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై చిన్నారులకు శిక్షణ అందిచాలని డిమాండ్ చేశారు.