అఫ్ఘాన్‌పై పాక్ పెద్ద మనసు
ఇస్లామాబాద్: తాలిబన్ల బారిన పడిన అఫ్ఘానిస్థాన్‌కు సహాయం చేసేందుకు పాకిస్థాన్ ముందుకొచ్చింది. పది రోజుల కిందట జరిగిన భారీ యుద్ధంలో నష్టపోయిన ఖుందుజ్ ప్రాంత ప్రజలకు ఆహార పదార్థాలను వెంటనే పంపించే ఏర్పాట్లు చేయాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. వెంటనే గోధుమలను పంపించే పనులుప్రారంభించాలని కోరారు. అఫ్ఘానిస్థాన్లోని ఖుందుజ్ ప్రాంతంలో పది రోజుల కిందట తాలిబన్లు విరుచుకుపడ్డారు.
ఈ క్రమంలో ప్రభుత్వ బలగాలకు, తాలిబన్లకు మధ్య ఘోర యుద్ధం చోటుచేసుకుంది. అక్కడి ప్రజలంతా భయకంపితులయ్యారు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. వారికి కనీసం తిండి కూడా దొరకని పరిస్థితి ఉంది. చివరికి ప్రభుత్వ బలగాల ఆధీనంలోకే ఖుందుజ్ ప్రాంతం వచ్చినా పరిస్థితి బాగాలేదు. దీంతో ఆహార ధాన్యాలు పంపించేందుకు పాక్ ముందుకొచ్చింది.