తెలంగాణకు కర్నూలు ఉల్లి
కర్నూలు: రోజురోజుకు పెరిగిపోతున్న ఉల్లి ధరలు మధ్య తరగతి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో కర్నూలు ఉల్లిని సబ్సిడీపై పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ మార్కెటింగ్ శాఖ అధికారులు వేలంపాట ద్వారా ఉల్లి కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు కర్నూలు జిల్లా మార్కెటింగ్ అధికారులతో ఆదివారం చర్చించారు.
అక్కడ కొన్న ఉల్లిని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా కర్నూలు మార్కెట్లో ఉల్లిని కొనుగోలు చేసి కిలో రూ. 20 ప్రకారం 13 జిల్లాలకు సరఫరా చేస్తోంది.