అంతన్నారింతన్నారే ..గంగరాజు
- బాధ్యతలు పట్టించుకోని వైనం
- పుష్కరాల్లోనూ అతిథి దర్శనమేనా
- హామీలు గాలిలో..ఎంపీ వ్యాపారాల్లో..ప్రజలు సమస్యల్లో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు.. లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరిట రియల్ ఎస్టేట్, హోటళ్ల వ్యాపారాలు, చెరకు ఫ్యాక్టరీలు.. ఇతరత్రా కంపెనీలు.. విశ్వహిందూ పరిషత్లో జాతీయ హోదా బాధ్యతలు.. ఇన్ని వ్యాపకాల్లో తలమునకలై ఎప్పుడో తీరిక దొరికిన తర్వాత గానీ నరసాపురం ఎంపీ పదవి గుర్తురావడం లేదు గోకరాజు గంగరాజుకు. పార్లమెంటు సభ్యునిగా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏడాదికాలంగా అతిథి దర్శన భాగ్యమే కలిగిస్తున్నారు.
ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాల సందర్భంలోనూ అడపాదడపానే కనిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా వ్యాపార, సినీ ప్రముఖుడే అయినప్పటికీ పుష్కరాలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ మన జిల్లాలో గోదావరి తీరం ఉన్న డెల్టా ప్రాంతానికి ఎంపీగా ఉన్న గంగరాజు మాత్రం ఇప్పటి వరకు పుష్కరాలపై సీరియస్గా దృష్టి సారించలేదు. పుష్కరాల సమీక్షలకు హాజరవడం గానీ.. పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీసి వేగవంతం చేయాలన్న బాధ్యత గానీ ఇంతవరకు ఆయన తీసుకోలేదు. కేంద్రం పుష్కరాల నిర్వహణకు రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడంలో కూడా ఆయన కనీస ప్రయత్నం చేయలేదన్న వాదనలున్నాయి. ఇక పుష్కరాల్లో కొవ్వూరు, నరసాపురం పట్టణాలతో పాటు జిల్లాలో పుష్కరాలు జరిగే అన్ని రైల్వేస్టేషన్లల్లో కనీస వసతులు లేవు. మిగిలిన అన్ని శాఖలు పుష్కరాలకు సమాయత్తమవుతుండగా రైల్వే శాఖ ఇంకా నిర్లిప్తంగానే ఉంది. ఎంపీగా రైల్వే శాఖ అధికారులతో మాట్లాడటం కాని, పుష్కరాల నేపథ్యంలో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసే ప్రయత్నం కాని నామమాత్రంగా కూడా ఎంపీ చేయలేదన్న విమర్శలున్నాయి.
సీఎం, కేంద్రమంత్రులు వస్తేనే దర్శనం
ఎంపీగా గెలిచిన తర్వాత ఈ 13 నెలల కాలంలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు పాల్గొనే సభలకు హాజరవడం.. స్థానికంగా ఆహ్వానాల ప్రాధాన్యతను బట్టి నియోజకవరాల్లో ప్రత్యక్షం కావడం తప్పించి, సమస్యలు చెప్పుకుందామంటే ఎంపీ కానరావడం లేదని నియోజకవర్గ ప్రజలే కాదు రాజకీయ నాయకులూ అంటున్నారు. నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికీ ఆయన పర్యటించని మండలాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏడాదికాలంలో మొత్తంగా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలకు 15 సార్లు, తణుకుకు 4 సార్లు, తాడేపల్లిగూడెంకు 3 సార్లు మాత్రమే వచ్చారు. ఆచంటకు అడపాదడపా వచ్చే ఆయన కొద్దోగొప్పో భీమవరానికి ఎక్కువసార్లు వస్తుంటారు. అక్కడే ఎంపీ కార్యాలయం ఉంది. ఎన్నికల సమయంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు ఆఫీస్లు పెడతానని హామీలు గుప్పించారు. అయితే ఇప్పటి వరకు క్యాంపు కార్యాలయాలకు అతీగతీ లేదు.
ఏడాదిలో కానరాని ఎంపీ ముద్ర
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల ప్రాధాన్యం పెరిగింది. అభివృద్ధి పరంగా ప్రోత్సహిస్తే కార్పొరేషన్ల స్థాయికి ఈ పట్టణాలు చేరే అవకాశం ఉంది. అయితే ఎంపీగా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. ఆక్వా ఉత్పత్తులకు ముఖ్య కేంద్రంగా ఉన్న భీమవరాన్ని ఆక్వారంగానికి సంబంధించి దేశంలోనే ముఖ్య పట్టణంగా తీర్చుదిద్దుతామని ఎన్నికల వేళ హామీనిచ్చారు. తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో పారిశ్రామికీకరణను పరుగులు పెట్టిస్తానని చెప్పారు.
తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న నరసాపురంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇక రైల్వేల అభివృద్ధి, గతం నుంచీ హామీలుగా మిగిలిపోయిన పైప్లైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా వంటి విషయాల్లో చాలా వాగ్దానాలు చేశారు. గంగరాజు ఎంపీగా గెలవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో హామీల్లో కొన్నయినా నెరవేరతాయని ప్రజలు ఆశించారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఏడాది దాటినా నరసాపురం లోక్సభ నియోజక అభివృద్ధి విషయంలో గంగరాజు మార్కు ఎక్కడా కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఒక్క పని కూడా ఎంపీ ఖాతాలో లేదని స్వయంగా సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.