లానినా ట్రెండ్ మొదలైంది
- ఈ నెలలో తరచుగా వర్షపాతం నమోదయ్యే అవకాశం
- ‘సాక్షి’తో హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వైకే రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు మళ్లీ ఊపందుకున్నాయి. దీంతో రాష్ట్రంలో మూడు, నాలు గు రోజులుగా అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలలో తరచుగా వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచ నా వేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్-ఇన్చార్జి వైకే రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సాక్షి: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
వైకే రెడ్డి: పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అదిప్పుడు భూమిపైకి ఉత్తర దిశగా కదిలింది. అలాగే నైరుతి రుతుపవనాలు ఊపందుకున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలోని గాలులు, బంగాళాఖాతంలోని గాలులు విలీనమై తేమ చొచ్చుకుని రావడం తదితర కారణాల వల్ల ప్రస్తుతం రాష్ట్రంలో కుండపోత, భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్లో ఇంతటి వర్షం చివరిసారిగా ఎప్పుడు నమోదైంది?
వైకే రెడ్డి: నగరంలో ఈ సీజన్లో ఇంతటి భారీ వర్షపాతం ఇప్పుడే నమోదైంది. 2000 ఆగస్టు 24న అత్యధికంగా 24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆ తర్వాత 2009లో 13 సెంటీమీటర్లు నమోదైంది. ఆ తర్వాత ఏడేళ్లకు ఇప్పుడు నగరంలో రెండు చోట్ల 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
ప్రస్తుత వర్షాలతో పంటలకు ఏమేరకు ఉపయోగం?
వైకే రెడ్డి: ప్రస్తుత వర్షాలు పంటలకు ఉపయోగమే. అనేకచోట్ల పంటలు ఎండిపోయే పరిస్థితుల్లో ఈ వర్షాలు వాటికి ప్రాణం పోస్తాయి. ఇంకా వారం, పది రోజులు వర్షాలు పడకున్నా వర్షాభావ పంటలకు నష్టంలేదు.
ఎల్నినో పోయిందన్నారు... మరి లానినా ఏర్పడిందా? లేదా?
వైకే రెడ్డి: ఎల్నినో వెళ్లిపోయింది కానీ.. లానినా ఇంకా ఏర్పడలేదు. ప్రస్తుతం తటస్థస్థితి కొనసాగుతోంది. అయితే లానినా ట్రెండ్ మాత్రం మొదలైంది. ఈ నెలాఖరు నాటికి అది బలపడే అవకాశాలున్నాయి. లానినా బలపడినా లేకపోయినా సెప్టెంబర్లో వర్షాలు సాధారణంగా కురుస్తాయి. ఈ నెలలో కొన్ని రోజులు వర్షాలు కురుస్తాయి... కొన్ని రోజులు సాధారణ స్థితి ఉంటుంది.