నోట్ల రద్దుపై మోదీ అర్ధరాత్రి సమావేశం..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తెల్లవారుజాము వరకూ కీలక సమావేశాలు నిర్వహించారు. కొత్త నోట్ల జారీలో తలెత్తిన సమస్యలు, బ్యాంకుల ముందు జనం పడిగాపులు, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై కేబినెట్ మంత్రులతో మంతనాలు జరిపారు. లోక్ కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో జరిగిన భేటీకి హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సమాచార, ప్రసారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ తోపాటు ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏటీఎంల స్థానంలో మైక్రో ఏటీఎంలు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదనపైనా మోదీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బ్యాంకుల నుంచి పరిమిత సంఖ్యలో కొత్త నోట్ల జారీ అవుతుండటం, దేశంలోని అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరడం, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై వదంతులు తదితర అంశాలపై ప్రధాని మంత్రులతో చర్చించినట్లు తెలిసింది.
కాగా, కొత్త రూ.500 నోట్లు అందుబాటులోకి రావడంతో బ్యాంకుల్లో నగదు మార్పిడి పరిమితిని రూ.4000 నుంచి 4500కు పెంచుతున్నట్లు ఆర్బీఐ, ఆర్థిక శాఖలు ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేశాయి. ఏటీఎంలలో విత్రా డ్రాయల్ పరిమితి కూడా రూ.2000 నుంచి రూ.2500కు పెంచామని, వారానికి రూ.24 వేల వరకు ఏటీఎంల నుంచి తీసుకోవచ్చని తెలిపాయి. అంతకుముందు(ఆదివారం సాయంత్రం) ప్రధాని మోదీ ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలోనే ప్రధాని బ్యాంకుల అధిపతులు, ఇతర భాగస్వాములతో సమీక్ష నిర్వహిస్తారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది.