రుణ మాఫీపై ఉత్కంఠ!
12 మండలాల్లో జరగని గ్రామ సభలు
- జాబితాల్లో పేర్లు లేక రెతన్నల ఆందోళన
- అర్హుల పూర్తి జాబితా ఇవ్వని బ్యాంకర్లు
- ఆందోళనలో రైతన్నలు
సాక్షి, కరీంనగర్ : రుణమాఫీపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం లక్ష రూపాయల్లోపు రుణాలు తీసుకున్న రైతుల గుర్తింపునకు చర్యలు తీసుకుంది. ముందుంగా బ్యాంకర్లు.. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయాధికారులతో ఈ నెల 27, 28 తేదీల్లో గ్రామసభలు నిర్వహించి అర్హులైన రైతులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. 30లోగా జిల్లావ్యాప్తంగా రుణమాఫీకి అర్హులైన రైతుల బాబితాను తయారు చేసి.. నివేదిక పంపించాలని ఆదేశించింది.
సభ ల్లో ఆయా బ్యాంకులు తమ నుంచి రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల పేర్లు ప్రకటిం చాలి. ఆ సభల్లోనే అర్హుల జాబితాతో బ్యాంకర్లు జాబితా తయారు చేసి అధికారులకు ఇవ్వాలి. కానీ.. జిల్లాలో పలు చోట్ల గ్రామ సభల నిర్వహణ తూతూమంత్రంగా జరుగుతోంది. రెండ్రోజుల్లోగా అన్ని గ్రామాల్లో సభలు పూర్తి చేయాల్సి ఉండగా.. ఇంతవరకు 12 మండలాల్లో సభలు నిర్వహించలేదు. పలు మండలాల్లో సగం గ్రామాలకే సభలు పరిమితమయ్యాయి. జగిత్యాలలో 31 గ్రామాలుండగా ఇం తవరకు ఏడు గ్రామాల్లోనే సభలు జరిగాయి. మహదేవ్‌పూర్‌లో 22 గ్రామాలుంటే.. 14 గ్రామాల్లోనే సభలు జరిగాయి.
ఇలాంటి మండలాలు జిల్లాలో మరిన్ని ఉన్నాయి. అయినా.. ఈ నెల 31న (ఆదివారం) జిల్లావ్యాప్తంగా గ్రామ సభలన్నీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ జేడీఏ ప్రసాద్ చెప్పారు. మరోపక్క.. సభల్లో బ్యాంకర్లు చదువుతోన్న పేర్లలో అర్హులైన తమ పేర్లు లేవని రైతులు అధికారులను నిలదీస్తున్నారు. ఇతర బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నామని.. ఆ జాబితా రాక.. సభలో తమ పేర్లు రాకపోవడంతో అర్హులైన రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. అల్గునూరులో నిర్వహించిన గ్రామ సభలో.. ఆంధ్ర, యూనియన్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారి పేర్లు చదవకపోవడంతో రైతులు ఆందోళన చేశారు.
అయినా యూనియన్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న రైతుల పేర్ల జాబితా మాత్రం అధికారులకు అందలేదు. జిల్లాలో పలు చోట్ల అధికారులకు ఇలాంటి చేదనుభవాలు ఎదురయ్యాయి. గ్రామ సభలు పూర్తయి.. రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితా తయారు చే సి.. ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు అందిస్తారో అధికారులూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ‘ప్రస్తుతం గ్రామ సభలు పూర్తిగా జరగలేదు.. 12 మండలాల నుంచి మాకు సమాచారం రాలే దు. వచ్చిన తర్వాతే తుది జాబితా తయారు చేస్తాం. శనివారంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించాం. అయినా వివరాలు రాలేదు’ అని లీడ్ బ్యాంక్ మేనేజర్ చౌదరి వివరణ ఇచ్చారు.