సాయ్, ఎస్సీ రైల్వే శుభారంభం
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర ఇంటర్ డిపార్ట్మెంట్స్ ‘ఎ’ డివిజన్ లీగ్ కబడ్డీ టోర్నమెంట్లో స్పోర్ట్స్ ఆథారిటీ (సాయ్) హాస్టల్, సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) జట్లు శుభారంభం చేశాయి. హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన లీగ్ పోటీల్లో సాయ్ హాస్టల్ జట్టు 22-10 స్కోరుతో అవలీలగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జట్టుపై విజయం సాధించింది.
తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి సాయ్ హాస్టల్ జట్టు 14-8తో ఆధిక్యాన్ని సాధించింది. సాయ్ జట్టులో మల్లేష్, టి.వరప్రసాద్ దూకుడుగా ఆడి విజయాన్ని అందించారు. ఎస్బీఐ జట్టులో ఎం.నర్సింగ్ రావు, విజయ్ కుమార్ యాదవ్ రాణించారు. రెండో లీగ్ మ్యాచ్‌లో ఎస్సీ రైల్వే జట్టు 45-24తో రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) జట్టుపై గెలిచింది. ఈపోటీలను హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కె.జగదీశ్వర్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు.