పేదలకు ఉచిత న్యాయ సహాయం
– లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : రూ.లక్షలోపు ఆదాయం ఉన్న అల్పసంఖ్యాక వర్గీయులు ఉచిత న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలని లోక్ అదాలత్ జిల్లా జడ్జి ఎంఏ సోమశేఖర్ ప్రజలకు సూచించారు. గురువారం బి.తాండ్రపాడులో సంగీతరావు ఎడ్యుకేషనల్ అకాడమి ఆధ్వర్యంలో ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..ఉచిత న్యాయ సాయాన్ని మతిస్థిమితం లేనివారు, పారిశ్రామిక కార్మికులు, మహిళలు, పిల్లలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు పొందవచ్చన్నారు. ఇందుకు న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం గృహహింస, మహిళాసాధికారత చట్టాలపై ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు వాడాలా ప్రసాదు, ఆదినారాయణరెడ్డి, మధుబాబు, ఎస్సీ, ఎస్టీ సొసైటీ డైరక్టర్ రామాంజనేయులు పాల్గొన్నారు.