వయసు...8 వికెట్లు...6
హెచ్‌సీఏ లీగ్‌లో బుడతడి సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఆ పిల్లాడి వయసు 8 ఏళ్లు... గత మూడేళ్లుగా క్రికెట్ నేర్చుకుంటున్నాడు. తొలి సారి పోటీ క్రికెట్ బరిలోకి దిగాడు. మొదటి వన్డే మ్యాచ్‌లోనే తన లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును చిత్తు చేశాడు. 12.3 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 మెయిడిన్లు కూడా ఉన్నాయి. (లీగ్స్ నిబంధనల ప్రకారం వన్డే మొత్తం ఓవర్లలో ఒక బౌలర్ మూడో వంతు ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు). హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) లీగ్స్‌లో పట్టపు రాఘవ అనే చిన్నారి సంచలన ప్రదర్శన ఇది. వివరాల్లోకెళితే...హెచ్‌సీఏ లీగ్స్‌లో భాగంగా ఆదివారం చమ్స్ ఎలెవన్, హైదరాబాద్ వాండరర్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఇందులో చమ్స్ ఎలెవన్ బౌలర్ రాఘవ (6/21) ధాటికి వాండరర్స్ 34.3 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. అనంతరం చమ్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 85 పరుగులు చేసి విజయాన్నందుకుంది.
హెచ్‌సీఏ లీగ్ చరిత్రలో పిన్న వయస్కుడైన క్రికెటర్ (8 ఏళ్ల 3 నెలలు)గా రాఘవ రికార్డు సృష్టించాడు. మాజీ ఆటగాడు ఎస్ఆర్ సురేశ్ వద్ద అతను శిక్షణ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నారాయణగూడలోని శ్రీ ఇంటర్నేషనల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న రాఘవకు కరాటేలోనూ మంచి నైపుణ్యం ఉంది. అండర్-9 కేటగిరీలో అతను అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం విశేషం.