కర్ణాటకలో ‘డైరీ’ రాజకీయం
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ మంత్రులు హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చారంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప విడుదల చేసిన డైరీ ప్రకంపనలు ఆగకముందే మరో డైరీ బీజేపీకి చెమటలు పట్టిస్తోంది. బీజేపీ నేతలు ఆ పార్టీ హైకమాండ్‌కు ముడుపులు ఇచ్చారంటూ సామాజిక మాధ్యమాల్లో మరో డైరీ దర్శనమిచ్చింది. యడ్యూరప్ప ఆప్తుడు, విధానపరిషత్ సభ్యుడు లేహర్‌సింగ్ ఇంటిపై ఐటీ సోదాల్లో డైరీ లభించినట్లు వార్తలొచ్చాయి.
అందులో ‘రిసీవ్డ్’ శీర్షికతో సీఎంఓ, ఆర్ఏ అనే వ్యక్తులు రూ.67కోట్లు, ఎంఐఆర్, ఏఎల్ఈ అనే వ్యక్తులు రూ.128కోట్లు, రేణు పేరుతో రూ.13కోట్లు, జేఎస్ పేరుతో రూ.9 కోట్లు, ఎస్క్యూ పేరుతో రూ.3 కోట్లు, ఎస్ఆర్ పేరుతో రూ.1.80 కోట్లు, ఆర్ఏ, కేఎస్ఈ పేరుతో రూ.31 కోట్లు, డీవీఎస్, పీఎస్ అనే వ్యక్తులు రూ.11 కోట్లు, ఇతర కంపెనీలు, కార్పొరేటర్లు రూ.128 కోట్లు... మొత్తం రూ.391.08 కోట్లు అందించినట్లుగా ఉంది. మొత్తం రూ.391.08 కోట్ల ముడుపులు అందించినట్లు, అందుకు సాక్ష్యంగా లెహర్‌సింగ్ సంతకం కూడా ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో డైరీ హల్చల్ చేస్తోంది.