ఈ అదృష్టం కోట్లలో ఒక్కరికే దక్కుతుంది...
లండన్: లండన్‌లోని వర్సెస్టర్‌షైర్ కౌంటీకి చెందిన 32 ఏళ్ల జోడి బెల్లింగల్, 33 ఏళ్ల మార్క్ దంపతులు ఎంతో అదృష్టవంతులు. వారిలాంటి అదృష్టం ప్రపంచంలో నాలుగు కోట్ల ఎనభై లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే లభిస్తోంది. ఆగస్టు ఒకటవ తేదీనే వారిద్దరి పుట్టిన రోజు. వారికి అదే రోజున తొలి సంతానం కలిగింది. ఆ పాపకు ఆ దంపతులు లిబ్బీ అని ముద్దుగా పేరు పెట్టుకున్నారు. ఆ కుటుంబంలో వారి ముగ్గురి పుట్టిన రోజు వేర్వేరుగా ఉంటే వేర్వేరు రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు జరపుకోవాల్సి వచ్చేది. ముగ్గురు పుట్టిన రోజును ఒకే రోజు జరుపుకోవడం వల్ల ఖర్చు కలిసొస్తుంది. ఖర్చుకు వెరవకపోయినా ఒక రోజునే జరుపుకోవడంలో ఓ థ్రిల్ ఉంది. ఘనంగా జరపుకునే వీలుంది.
వాస్తవానికి డాక్టర్లు ఇచ్చిన డేట్ ప్రకారం జూలై 23వ తేదీన జోడి బెల్లింగల్ డెలివరీ కావాల్సి ఉంది. ఎందుకోగానీ తొమ్మిది రోజులు ఆలస్యంగా సహజసిద్ధంగానే డెలివరీ అయింది. ‘ఇది అద్భుతమైన విషయం. మా పుట్టిన రోజునే జన్మించేందుకు లిబ్బీ తొమ్మిది రోజుల పాటు నా కడుపులో నిరీక్షిందనే విషయం తలచుకుంటే ఒళ్లంతా పులకరించి పోతోంది. ఇది కాకతాళీయమే కావచ్చు. కానీ ఈ అద్భుతం నా జీవితంలో జరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదు. ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు’ అని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన జోడి బెల్లింగల్ వ్యాఖ్యానించారు.
తమ పుట్టిన రోజు నాడే నాకు కూతురు జన్మించిందంటే ఆస్పత్రి నర్సులు కూడా ముందుగా నమ్మలేకపోయారు. ఆ తర్వాత వారంతా స్వీట్లు కొనుక్కొచ్చి తమ పాప పుట్టిన సందర్భాన్ని సెలబ్రేట్ చేశారని జోడి తెలిపారు. ‘ఇప్పుడు ఈ పాప మాకొక బహుమానం అల్లారుముద్దుగా చూసుకుంటాం. ఒకో రోజున ముగ్గురం పుట్టిన రోజును జరుపుకుంటాం’ అని ఆమె చెప్పారు. ప్రపంచంలో నాలుగు కోట్ల ఎనభై లక్షల మందిలో ఒక్కరికే ఇలాంటి అదృష్టం కలిసొస్తుందని, ఐర్లాండ్, ఇంగ్లండ్‌లో చట్టబద్ధంగా పలు బెట్టింగ్ షాపులను నడుపుతున్న బుక్‌మేకర్ పాడి పవర్ తెలిపారు.