ఎయిర్టెల్ రీచార్జ్‌పై రూ.4 లక్షల ఇన్సూరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం బంపర్ఆఫర్ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్ రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారతి ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది.
రూ.599 ఆఫర్లు
రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌పై రోజుకు 2జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. ప్రతి రీఛార్జితో మూడు నెలల వరకు బీమా కవర్ ఆటోమాటిక్‌గా కొనసాగుతుంది.
18-54 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులందరికీ లభించే ఈ జీవిత బీమా సౌకర్యానికి ఎలాంటి వైద్య పరీక్షలు, ధృవీకరణ పత్రం అవసరం లేదనీ, తక్షణమే డిజిటల్ కాపీని కస్టమర్ ఇంటికే పంపిస్తామని భారతి ఎయిర్టెల్ ఢిల్లీ-ఎన్‌సిఆర్, సీఈవో వాణి వెంకటేష్ తెలిపారు. భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యంతో సులభంగా వినియోగదారులకు లైఫ్ ఇన్సూరెన్స్‌ను అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ ప్రయోజనం పొందడానికి, కస్టమర్ ఎస్ఎంఎస్, ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లేదా ఎయిర్టెల్ రిటైలర్ ద్వారా మొదట రీఛార్జ్ చేసిన తర్వాత నమోదు చేసుకోవాలన్నారు. కాగా న్యూఢిల్లీ సహా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించిందని, క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఆఫర్ ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.