రెండు పూటలా అంగన్వాడీ కేంద్రాలు
=నవంబరు 1 నుంచి అమలుకు సన్నాహాలు
=సహాయకులుగా లింక్ వర్కర్ల నియామకం
నర్సీపట్నం, న్యూస్‌లైన్: మాతా, శిశు మరణాల నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను నవంబర్ 1 నుంచి రెండు పూటలా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అదనపు బాధ్యతలతో సతమతమవుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు సాయంగా లింక్‌వర్కర్ల నియామకానికి సన్నాహాలు చేస్తోంది. మాతా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 22 ప్రాజెక్టుల్లో 4,874 అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఏజెన్సీలోని కేంద్రాల్లో అమృతహస్తం, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్నం వరకే పనిచేస్తున్న ఈ కేంద్రాలను నవంబరు 1 నుంచి రెండు పూటలా నిర్వహించనున్నారు.
రెండు పూటలా సాధ్యమేనా?
జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,874 కేంద్రాలకు ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్నవి 997 మాత్రమే. ఇతర శాఖల ప్రభుత్వ భవనాల్లో 637 కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనంతో పాటు రెండు పూటలా కేంద్రం నిర్వహణ సాధ్యమేనా? అని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. వసతులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు ఆరోగ్య కార్యకర్త విధులతో పాటు ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్లను చేర్పించడం, ఎన్నికల్లో ఓటర్ల స్లిప్పులు పంచడం, ఎన్నికల విధి నిర్వహణ తదితర బాధ్యతల్ని అప్పగిస్తున్నారు.
దీనివల్ల ఆరోగ్య కార్యకర్తగా న్యాయం చేయలేకపోతున్నారు. వీరిని ఇతర పనులకు వినియోగించరాదన్న నిబంధనలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అంగన్వాడీ కార్యకర్తలకు సహాయంగా ఒక్కో కేంద్రానికి ఒక్కొక్క లింక్ వర్కర్‌ను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరు రిజిస్టర్ల నిర్వహణ బాధ్యతలతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు సహకరిస్తారు. దీనిపై ఐసీడీఎస్ పీడీ రాబర్ట్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా జీవో ప్రకారం అంగన్వాడీ కార్యకర్తలకు అదనపు బాధ్యతలను అప్పగించరాదని స్పష్టం చేశారు. వీరికి సహాయకులుగా లింక్ వర్కర్లను నియమించి కేంద్రాలను మరింత బలోపేతం చేయనున్నట్టు పేర్కొన్నారు.