చీకటి నింపిన శస్త్ర చికిత్స
ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన ఎనిమిది మంది
సామర్లకోట: మందగించిన చూపును కాస్త మెరుగు పరుచుకుందామని ఆశించడమే ఆ బడుగు జీవులకు శాపంగా పరిణమించింది. ఉచితంగా కంటి శస్త్ర చికిత్స చేయించుకుని ఏకంగా ఎనిమిది మంది కూలీలు చూపునకు దూరమైన ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గంపేటలోని కోడూరి రంగారావు లయన్స్ ఆస్పత్రిలో ఉచితంగా కంటి పరీక్షలు చేసి.. ఆపరేషన్లు, అద్దాలు అందజేస్తున్నారని కొందరు చెప్పడంతో ఏప్రిల్ 13న వేట్లపాలెంకు చెందిన 50ృ55 ఏళ్ల వయసున్న 10 మంది వెళ్లారు. వీరికి ఆ రోజు పరీక్షలు చేసి, మరుసటి రోజు ఆపరేషన్లు చేసి పంపించారు. ఇంటికి వచ్చిన వారం రోజుల తర్వాత వీరిలో ఎనిమిది మంది.. రామిశెట్టి సత్యవతి, కుప్పాల కృపారావు, బావిశెట్టి రాంబాయి, చిట్టూరి సత్యనారాయణ, గొరత రామకృష్ణ, ఇసాక్, పెద్దిరాజు, బొందాడ సత్యారావుల కళ్ల లోంచి నీరు కారడం మొదలైంది.
పైగా మంటలు పుట్టడంతో శస్త్ర చికిత్స చేసిన ఆసుపత్రికే వెళ్లారు. అక్కడ వీరికి చుక్కల మందు వేసి పంపించారు. నీరు కారడం మరింత ఎక్కువ కావడంతో మే నెలలో కూడా ఆస్పత్రికి వెళ్లారు. అదే చుక్కల మందు వాడాలంటూ అక్కడి సిబ్బంది చెప్పి పంపించేశారు. జూన్లో పూర్తిగా కళ్లు కనిపించడం మానేశాయి. పైగా కనుగుడ్డులో విపరీతమైన నొప్పి.. నీరు కారడం మరింత పెరిగింది. బాధితుల బంధువులు వెళ్లి ఆస్పత్రి నిర్వాహకులను నిలదీశారు.
తప్పనిసరి పరిస్థితుల్లో వారిని విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి పంపించారు. అక్కడ పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి కంటికి ఇన్ఫెక్షన్ సోకిందని, అందు వల్లే ఎనిమిది మందికి చూపు పోయిందని నిర్ధారించారు. వీరిలో వేట్లపాలేనికి చెందిన కృపారావు, జగ్గంపేట మండలం రాచపల్లికి చెందిన ఇసాక్ల కుడికళ్లు కుళ్లిపోవడంతో శస్త్ర చికిత్స చేసి పూర్తిగా తొలగించారు. వీరికి మరో కన్ను కూడా పని చేయడం లేదు. మిగిలిన ఆరుగురికి మందులిచ్చి పంపించేశారు. వీరి కళ్లు కూడా పూర్తిగా కనిపించడం లేదు. ‘ఈ ఆపరేషన్ చేయించుకోక పోయున్నా బావుండు.. గుడ్డి కంటే మెల్ల నయం అనుకుని ముందుకు సాగేటోళ్లం. ఇప్పుడెలా పనులు చేసుకోవాలి.. ఎలా బతకాలి?’ అంటూ బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.