25,117 ఎకరాలు సిద్ధం
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పారిశ్రామికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఐటీ ఆధారిత, ఫార్మా, బల్క్‌డ్రగ్, సినీ పరిశ్రమల స్థాపనకు తగినంత ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేస్తోంది. పెట్టుబడులకు ప్రోత్సాహక వాతావరణం కల్పించేందుకు వీలుగారంగారెడ్డి జిల్లాలో తక్షణ కేటాయింపులకు అనువుగా ఉన్న భూములను గుర్తించింది. తెలంగాణ రాష్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీఐఐసీ) జిల్లాలో 25,117 ఎకరాల మేర భూమి అందుబాటులో ఉన్నట్లు లెక్క తేల్చింది.
నెలరోజులుగా ప్రభుత్వ భూములను సర్వే చేసిన టీఐఐసీ యంత్రాంగం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ‘తెలంగాణ బ్రాండ్’ను విశ్వవ్యాప్తం చేయాలని భావిస్తున్న కేసీఆర్ సర్కారు.. నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోంది. ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పరిశ్రమల స్థాపనను సరళతరం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వివాదరహిత భూములను గుర్తించే పనిలో నిమగ్నమైంది.
10,852 ఎకరాల మిగులు భూమి గుర్తింపు
గతంలో వివిధ పరిశ్రమలకు, బడా కంపెనీలకు జిల్లాలో 39వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పారిశ్రామిక అవసరాలకు పోను దీంట్లో సుమారు 10,852 ఎకరాల మేర మిగిలి ఉన్నట్లు జిల్లా యంత్రాంగం లెక్కతీసింది. ఆయా సంస్థలు అట్టిపెట్టుకున్న ఈ భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అదే సమయంలో పెట్టుబడులపై గంపెడాశలు పెట్టుకున్న ప్రభుత్వం.. భూ ల భ్యతపై ప్రత్యేక దృష్టి సారించింది.
పరిశ్రమల వద్ద వృధాగా ఉన్న భూములను స్వాధీనం చేసుకోవడమేగాకుండా మరింత భూమిని సేకరించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారగణం జిల్లాలో 63,726 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిగ్గు తేల్చింది. దీంట్లో చాలావరకు కొండలు, గుట్టలతో నిండిఉన్నట్లు గుర్తించింది. వీటిని మైనింగ్‌కు ఇస్తే బాగుంటుందని యంత్రాంగం ప్రభుత్వానికి సూచించింది.
అదనంగా 14,265 ఎకరాలు
ఇప్పటివరకు ఎవరికీ కేటాయించని ప్రభుత్వ భూమి 4,300 ఎకరాలు ఉన్నట్లు తేల్చిన యంత్రాంగం... జిల్లావ్యాపం్తగా అన్ని మండలాల్లోని ప్రభుత్వ భూముల జాబితాను రూపొందించింది. దీంతో జిల్లాలో 63,726 ఎకరాలు ఉన్నట్లు సర్వేలో తేలింది. దీంట్లో పరిశ్రమల స్థాపనకు యోగ్యమైన భూములపై టీఐఐసీ ప్రత్యేకంగా సర్వే నిర్విహ ంచింది. తొలి దశ లో 6,706.34 ఎకరాలు గుర్తించిన టీఐసీసీ, మలివిడతలో 7,559.29 ఎకరాలు ఉన్నట్లు తేల్చింది.
ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 25,117 ఎకరాలు తక్షణ కేటాయింపులకు అనువుగా ఉందని, దీనికి అదనంగా ఇప్పటివరకు ఎవరికి కేటాయించని వివాదరహిత భూమి 4,300 ఎకరాల మేర అందుబాటులో ఉందని గుర్తించింది. అయితే, టీఐసీసీ గుర్తించిన భూమి అధికశాతం కుల్కచర్ల, యాచారం, మర్పల్లి, బషీరాబాద్, బంట్వారం, యాలాల తదితర మారుమూల మండలాల్లోనే ఉండగా.. ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అనువైనది కాకపోవడం గమనార్హం. నగర శివార్లలో మాత్రం భూ లభ్యత లేకపోవడం అధికార యంత్రాంగానికి ఒకింత ఆందోళన కలిగిస్తోంది.
ఔటర్ రింగ్‌రోడ్డు, విమానాశ్రయం, కృష్ణాజలాలు, తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశాల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికసంస్థలు ముందుకొస్తాయని, మారుమూల ప్రాంతాల్లో వందల ఎకరాలు కేటాయించిన ఫలితం శూన్యమేననే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్భాగమైన బాలానగర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, కుత్భుల్లాపూర్, ఉప్పల్ మండలాలతో పాటు గ్రామీణ మండలాలైన దోమ, కుల్కచర్ల, బషీరాబాద్ మండలాల్లో పరిశ్రమలకు అనువుగా ఒక ఎకరా కూడా తేలకపోవడం గమనార్హం.