రైతులపై దౌర్జన్యం
- పోర్టు భూసేకరణపై తమ గోడు చెప్పేందుకు వచ్చిన రైతులు
- వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు
- సిగ్గుందా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి రవీంద్ర
మచిలీపట్నం : స్థానిక టౌన్‌హాలులో బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ అంశంపై టీడీపీ కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు శని వారం నిర్వహించిన సమావేశం తోపులాటకు దారితీసింది. బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల సేకరణకు జారీచేసిన నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరైన కొందరు రైతులు మాట్లాడుతూ తమ సొంత భూములను సేకరించి రోడ్డున పడేస్తారా అంటూ మంత్రి, ఎంపీని నిలదీశారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రైతులపై దౌర్జన్యానికి దిగారు. రైతులు, కార్యకర్తల మధ్యతోపులాట చోటుచేసుకుంది.
అదే సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహంతో ‘మీకు సిగ్గులేదా? బందరు పోర్టును అడ్డుకుంటున్నారు. పేర్ని నాని రెచ్చగొడితేనే మీరు ఇక్కడకు వచ్చారు. ఏదేమైనా పోర్టు నిర్మించి తీరుతాం’ అంటూ ఊగిపోయారు. ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ రైతుల ఇష్టం లేనిదే భూములు సేకరించమని, ఈ కార్యక్రమంలో రాద్ధాంతం చేయవద్దని కోరారు. టీడీపీ కార్యకర్తలుగా ఉన్న కొందరు రైతులు తమ అభిప్రాయం చెప్పేందుకు ముందుకు వచ్చినా అవకాశం ఇవ్వలేదు. రైతులకు భూసేకరణపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిగతంగా వచ్చి చెబితే వాటిని పరిష్కరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించి పోర్టు నిర్మాణం చేస్తామని ప్రకటన చేయిస్తామని మంత్రి చెప్పారు.