ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేం
సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశం మేరకు దీనికి సంబంధించి కసరత్తు మొదలుపెట్టింది. ఏపీ స్థానికత గల 1,252 మంది ఉద్యోగులను 4 నెలల క్రితం తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేశాయి. ఆయా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 42, ఏపీ ప్రభుత్వం 58 శాతం వేతనాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసినా.. ఏపీ మాత్రం భారంగా పరిగణిస్తోంది.
తెలంగాణ సంస్థల్లో పనిచేస్తున్న వారికి తామెలా జీతాలు ఇస్తామనే వాదనను సుప్రీంకు విన్నవించే యోచనలో ఉంది. ఈ విషయమై న్యాయ నిపుణులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను జటిలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై రిలీవ్ అయిన ఉద్యోగులు, సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కలిసేందుకు సిద్ధమవుతున్నారు.