ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ సాక్షిగా జేసీకి అవమానం
హైదరాబాద్: టీడీపీ యువనేత లోకేష్‌ను కలవడానికి వెళ్లిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా తీవ్ర అవమానం జరిగింది. నియోజక వర్గ పనులకు సంబంధించి మంగళవారం లోకేష్‌ను కలవడానికి వెళ్లిన జేసీ.... ముందుగా చిన్నబాబు అపాయింట్మెంట్ తీసుకోలేదనే కారణంతో వెనుదిరగాల్సి వచ్చింది. లోకేష్‌ను కలవడానికి గంటసేపు వేచి చూసి చివరకు లోకేష్ బిజిగా ఉన్నారని పీఏ తెలపడంతో జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహంగా పార్టీ కార్యాలయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
సీనియర్ నాయకులమైనా తమకు పార్టీలో ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ జేసీ ప్రశ్నించారు. సీఎం దగ్గరకు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా తాము వెళ్లిన సందర్బాలున్నాయని ఆయన గుర్తు చేశారు. సీనియర్లమైనా తమకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా లోకేష్ బాధితుల్లో ఒక్క జేసీనే కాదని... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఉన్నారనే పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అయితే జేసీకి... లోకేష్ సమయం ఇవ్వకపోవడానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడుపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వాఖ్యలే కారణమంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని జేసీ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అవుట్‌డేట్ నాయకుడని జేసీ మీడియా ముందు కుండబద్దల కొట్టినట్లు చెప్పటంతో...చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిలో బాగంగానే లోకేష్ జేసీని కలవడానికి ఇష్టపడలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది.