అతనొక్కడే బాయ్‌ఫ్రెండ్
హీరోయిన్లకు బాయ్‌ఫ్రెండ్స్ ఉండటం అనేది సర్వసాధారణం. అయితే ఈ విషయాన్ని కొందరు ధైర్యంగా వెల్లడిస్తారు. మరి కొందరు మారుస్తారు. ఇక ఎమిజాక్సన్ లాంటి వారయితే ఎలాంటి విషయాలనైనా నిర్భయంగా చెప్పేస్తారు. ప్రస్తుత క్రేజీ నటీమణుల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరని చెప్పవచ్చు. తమిళంలో చేసింది రెండు చిత్రాలైనా విపరీతంగా పాపులారిటీ సంపాదించుకుంది ఎమిజాక్సన్. వాటిలో తొలి చిత్రం మదరాసు పట్టణం విజయం సాధించగా రెండో చిత్రం తాండవం నిరుత్సాహపరచింది.
ఇక హిందీలో నటించిన తొలి చిత్రం ఏక్ దివాన్ తా చిత్రం కూడా ఎమికి నిరాశనే మిగిల్చింది. అయినా గ్రేట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ సరసన ప్రతిష్టాత్మక చిత్రం ఐలో నటించే అవకాశం కొట్టేసింది. ఈ చిత్రంపై ఎమిజాక్సన్ చాలా ఆశలు పెట్టుకుంది. బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చడంలో జాణగా పేరు తెచ్చుకున్న ఈ లండన్ బ్యూటీ బాలీవుడ్ నటుడు ప్రతీక్‌తో ప్రేమాయణం నడిపి ఆ తరువాత అతనికి టాటా చెప్పింది.
తాజాగా బాయ్‌ఫ్రెండ్ ఎవరన్న ప్రశ్న తనకున్న ఏకైక బాయ్‌ఫ్రెండ్, నటుడు ఆర్యనేనని పేర్కొంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ, తాను లండన్‌కు చెందిన నటినని చెప్పింది. తమిళ సినిమాల్లో నటించడానికి చెన్నైకి వచ్చినప్పుడు తొలుత పరిచయమైన హీరో ఆర్యనేనని చెప్పింది. నిజం చెప్పాలంటే తనకిక్కడ తెలిసిన వారు చాలా తక్కువని బాయ్‌ఫ్రెండ్‌గా చెప్పుకునే ఏకైక వ్యక్తి ఆర్యనేనని పేర్కొంది. తాను నటించిన ఐ చిత్రం విడుదల తరువాత మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనే ధీమాను ఎమిజాక్సన్ వ్యక్తం చేస్తోంది.