భద్రాది రామాలయంలో ఆభరణాల తనిఖీ
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని బంగారు ఆభరణాలను దేవాదాయ శాఖ జ్యూయలరీ అధికారి భాస్కర్ మంగళవారం తనిఖీ చేశారు. సీతమ్మ మంగళ సూత్రం, లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ మాయమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆలయంలోని మొత్తం ఆభరణాల లెక్క తేల్చాలని ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.
దీంతో జేవీవో భాస్కర్ బంగారు ఆభరణాలను పరిశీలించారు. ఆలయ ఈవో రమేష్‌బాబుతోపాటు అర్చకుల సమక్షంలో గర్భ గుడిలోని ప్రత్యేక బీరువాలోని ఆభరణాలను బయటకు తీశారు. అందుబాటులో ఉన్న నివేదిక ఆధారంగా ఒక్కో బంగారు ఆభరణాన్ని పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారి భాస్కర్ మాట్లాడుతూ... బంగారు ఆభరణాలపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
ఆభరణాల మాయంపై ఆలయ అధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భద్రాచలం సీఐ శ్రీనివాసులు ఆలయాన్ని సందర్శించి.. కేసుకు సంబంధించి విచారణ చేపట్టారు. బంగారు ఆభరణాలు భద్రపరిచే ప్రదేశంతోపాటు ఆలయంలో సీసీ కెమెరాల పనితీరు ఎలా ఉందనే అంశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం ఆలయ ఈవో రమేష్‌బాబుతో సీఐ చర్చించారు. అర్చకులు, సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడి కేసు పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. వాస్తవంగా భద్రాద్రి ఆలయంలో 50 కేజీల బంగారం, 750 కేజీల వెండి ఉంది. అయితే అర్చకుల ఆధ్వర్యంలో ఉన్న బంగారు ఆభరణాలనే ప్రస్తుతం తనిఖీ చేస్తున్నారు. మొత్తం పరిశీలించినట్లు అయితే స్వామి వారి బంగారం భద్రంగా ఉందా లేదా అనే అంశం తేలనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.