లారీల సమ్మె యథాతథం
ప్రభుత్వంతో టీ. లారీ యజమానుల సంఘం చర్చలు విఫలం
రవాణా పన్ను తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా
అత్యవసర సరుకు రవాణా వాహనాలకు మాత్రం మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: డిమాండ్లను పరిష్కరించాలంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రకటించింది. సమ్మె నివారణపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైనట్లు తెలిపింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య రవాణ పన్ను తగ్గింపు సహా ఇతర డిమాండ్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవటంతో సమ్మెకు దిగుతున్నట్లు చెప్పింది. పాలు, నీళ్లు, మందులు లాంటి అత్యవసర సరుకు రవాణా వాహనాలు మినహా మిగతా 2.75 లక్షల సరుకు రవాణా వాహనాలు సమ్మెలో పాల్గొంటాయని సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ ధోరణిలో మార్పు రాకుంటే అత్యవసర సరుకు రవాణా వాహనాలను కూడా సమ్మెలోకి తెస్తామని, పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లను కూడా దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అంతకుముందు రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు చర్చించారు.
ఈ సమావేశంలో మొత్తం 11 డిమాండ్లను సంఘం ప్రతినిధులు ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో త్రైమాసిక పన్నును జనాభా దామాషా పద్ధతిలో 58:42 నిష్పత్తిలో తగ్గించాలని, రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పన్ను తీసుకుని రెండు రాష్ట్రాల మధ్య లారీలు తిరిగేందుకు వెసులుబాటు కల్పిస్తూ కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ వీటిపై సీఎం స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున తానేమీ చెప్పలేనని సునీల్‌శర్మ తేల్చి చెప్పారు. మిగతా డిమాండ్లపై వారం గడువు కోరారు. అయితే మిగతా వాటికి సంబంధించి గతంలోనే ఉత్తర్వులు వెలువడినందున కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందన్న సంఘం ప్రతినిధులు చర్చలు విఫలమైనట్లు చెబుతూ బయటకు వచ్చారు.