పోగొట్టుకున్న వస్తువుల కోసం... ఇక్కడ క్లిక్ చేయండి!
పోగొట్టుకున్న, దొరికిన వారిని కలిపే లాస్ట్‌క్లిక్‌ఫౌండ్
* ప్రస్తుతం 40 వేలకు పైగా వస్తువుల లిస్టింగ్..
* 3 నెలల్లో హైదరాబాద్‌లోనూ సేవలు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్తువులను కొనడానికే కాదు.. పోగొట్టుకున్న వస్తువులూ ఆన్లైన్లో తిరిగి పొందగలిగితే! వస్తువులు పోగొట్టుకున్న వారిని, దొరికిన వారిని ఇద్దరినీ ఒకే వేదికగా కలపగలిగితే!! అచ్చం ఇలాంటి సేవలనే అందిస్తోంది ‘లాస్ట్‌క్లిక్‌ఫౌండ్.కామ్’.
ప్రస్తుతం బెంగళూరుకే పరిమితమైన ఈ సేవల్ని రాబోయే మూడు నెలల్లో హైదరాబాద్‌లోనూ ప్రారంభించబోతోం ది. సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ వంటి వెలకట్టలేని వస్తువుల్ని పోగొట్టుకున్న వారికి తిరిగి అందించటంలో గొప్ప తృప్తి ఉంటుందంటున్న ఈ సంస్థ సీఈఓ పరం రామ్... ‘సాక్షి’ స్టార్టప్ డైరీ ప్రతినిధితో తమ ప్రయాణం గురించి ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే...
‘‘నాకు నిన్న బస్సులో ఫలానా విద్యార్థిది ఎస్ఎస్సీ సర్టిఫికెట్ దొరికింది. సంబంధిత వ్యక్తి ఫలానా నంబర్లో సంప్రదిస్తే అందజేస్తా’’ అన్న పోస్ట్‌ను ఓ రోజు నేను ఫేస్బుక్లో చూశా. అప్పుడే అనిపించింది ఇలా ఫేస్బుక్, ట్వీటర్లలో కాకుండా పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందేందుకూ ఓ వెబ్సైట్ ఉంటే బాగుండునని!! ఇంకేముంది! రూ.45 లక్షల పెట్టుబడితో 2013లో లాస్ట్‌క్లిక్‌ఫౌండ్.కామ్‌ను ప్రారంభించాం.
వారినిద్దరినీ కలిపే వేదిక..
దేశంలో రోజూ సినిమా హాలు, షాపింగ్ మాల్, ఎయిర్పోర్ట్, బస్సు, రైలు, ఆటో సహా ఇంటా, బయటా ఎక్కడో ఒకచోట లక్షలాది వస్తువులు పోతుంటాయి. ఇందులో సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాగులు, పర్సులు, వాహనాల, సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్‌ల వంటి ఎన్నో వస్తువులుంటాయి. వాటిలో చాలా వరకు వస్తువులు ఎవరికో ఒకరికి దొరుకుతుంటాయి కూడా. లాస్ట్‌క్లిక్‌ఫౌండ్ ఏం చేస్తుందంటే.. మీకు దొరికిన వస్తువుల తాలూకు వివరాలను మా వెబ్సైట్లో పెడితే చాలు.
వాటి అసలైన ఓనరెవరో గుర్తించి వారికి తిరిగి అందజేస్తాం. పోగొట్టుకున్న వస్తువులు మావంటూ వచ్చే కస్టమర్లను గుర్తిం చేందుకు క్లౌడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వంటి వాటికైతే ఈఎంఐ నంబర్, వాహనాల వంటివైతే ఇంజిన్, చాసిస్ నంబర్లు వంటి వాటిని చెప్పమంటాం. ఆధారాలు చూపించమంటాం. సరిగ్గా ఉన్నాయని తేలితే సంబంధిత వ్యక్తులకు అందజేస్తాం.
త్వరలోనే హైదరాబాద్‌కు విస్తరణ...
లాస్ట్‌క్లిక్‌ఫౌండ్ సైట్లో వస్తువుల్ని పోగొట్టుకున్నా సరే తిరిగి పొందే టెక్నాలజీని కూడా కొనుగోలు చేయొచ్చు. అంటే ట్యాగ్స్, లేబుల్స్ వంటివన్న మాట. ఒకరకంగా చెప్పాలంటే సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఇదే. ఇక మా విస్తరణ విషయానికొస్తే మూడేళ్లలో మా వెబ్సైట్లో 60 లక్షల వస్తువులు లిస్ట్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సీఈఓ పరం రామ్ చెప్పారు. ‘అందుకే ఈ ఏడాది ముగింపు నాటికి హైదరాబాద్‌లోనూ విస్తరించనున్నాం. పెట్టుబడుల నిమిత్తం హైదరాబాద్ ఏంజిల్స్‌తో చర్చిస్తున్నాం. త్వరలోనే 1-2 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు డీల్‌ను క్లోజ్ చేస్తాం. ప్రస్తుతం లాస్ట్క్లిక్ఫౌండ్లో ఐదుగురు ఉద్యోగులున్నారు’ అని అన్నారు.
40 వేలకు పైగా వస్తువుల జాబితా...
ప్రస్తుతం లాస్ట్క్లిక్ఫౌండ్లో 40 వేల పోగొట్టుకున్న వస్తువులు రిజిస్టరై ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 30 వేల వరకు వస్తువులను వారి యజమానులకు తిరిగి అందజేసినట్లు సీఈఓ పరం రామ్ చెప్పారు. ‘ఈ సేవలన్నీ ఉచితంగానే అందజేస్తున్నాం. ఆన్లై న్లో బెంగళూరు సిటీ పోలీస్ అక్నాలెడ్జ్మెంట్ను పొందేందుకు పోలీస్ విభాగంతో ఒప్పందం చేసుకున్నాం. దీంతో పోగొట్టుకున్న పాస్‌పోర్ట్, డాక్యుమెంట్లు వంటి వాటిని తిరిగి దరఖాస్తు చేసుకోవాలంటే అవసరమయ్యే పోలీస్ అక్నాలెడ్జ్మెంట్ను లాస్ట్‌క్లిక్‌ఫౌండ్ ద్వారా ఆన్లైన్లోనే నేరుగా పొందే వీలుంటుంది’ అని అన్నారు.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...