కేజ్రీవాల్ పిచ్చి ముఖ్యమంత్రి: షిండే
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన పేరు ప్రస్తావించకుండా విమర్శనాస్త్రాలు సంధించారు. పిచ్చి ముఖ్యమంత్రి(మ్యాడ్ చీఫ్ మినిస్టర్) అంటూ ఎద్దేవా చేశారు. పిచ్చి సీఎం కారణంగానే పోలీసు అధికారుల సెలవులు రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు.
మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'నేను పోలీస్‌గా పనిచేసినప్పుడు అల్లర్ల కారణంగా నా పెళ్లికి పెట్టుకున్న సెలవు రద్దయింది. ఇప్పుడు ఒక పిచ్చి ముఖ్యమంత్రి కారణంగా పోలీసుల సెలువులు రద్దు చేయాల్సి వచ్చింది' అని షిండే వ్యాఖ్యానించారు. అయితే ఆయన కేజ్రీవాల్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. షిండే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నుంచి స్పందన రాలేదు.