ఉప్పుటేరు పాయల్లోనే ఉప్పాడ బోట్లు
కృత్తివెన్ను : హుదూద్ తుపాను తాకిడికి తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన 65 బోట్లు కృత్తివెన్ను మండలంలోని పల్లెపాలెం, పడతడికల్లోని ఉప్పుటేరు పాయలకు శనివారం రాత్రి చేరుకున్నాయి. తహశీల్దార్ పి.మధుసూధనరావు క థనం ప్రకారం ఉప్పాడకు చెందిన 65 బోట్లలో సుమారు 700 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు.
ఈ సమయంలో బంగళాఖాతంలో ఏర్పడిన హుదూద్ తుపాను కారణంగా స్వగ్రామం చేరడానికి సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవటంతో సురక్షిత ప్రాంతమైన కృత్తివెన్ను మండలానికి వారు చేరుకున్నారు. మార్గమధ్యంలో అంతర్వేదిలో కొందరు మత్స్యకారులు దిగి స్వస్థలానికి వెళ్లిపోగా సుమారు 80 మంది మత్స్యకారులు కృత్తివెన్ను మండలంలో బోట్లకు లంగరు వేసి కాపలాగా ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు శనివారం రాత్రి వారి నుంచి పూర్తి వివరాలు సేకరించి వారికి పునరావాస శిబిరం ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం అల్పహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
వాతావరణం కుదుట పడే వరకు ఇక్కడే...
సముద్రంలో వాతావరణం ప్రశాంతత ఏర్పడి చేపలవేటకు అనుకూలించే వరకు ఉప్పాడకు చెందిన బోట్లు కృత్తివెన్ను మండలంలో ఉంటాయని ఆర్డీవో సాయిబాబు తెలిపారు. ఆదివారం కృత్తివెన్ను మండలానికి వచ్చిన ఆర్డీవో ఉప్పాడకు చెందిన మత్స్యకారులతో మాట్లాడారు. ఆర్డీవోతో పాటు మండల తుపాను ప్రత్యేకాధికారి, ఉపాధిహామీ అడిషనల్ పీడీ సురేష్, ఎంఈవో సత్యవతి ఉన్నారు.
ప్రమాద సూచికలు ముందు మాకే తెలుస్తాయి
సముద్రంలో వేటకు వెళ్లిన మాకు తీరం నుంచి వచ్చిన సమాచారం కన్నా సముద్రంలో అలల ఉధృతే తుపాను ప్రభావాన్ని మాకు ముందుగా తెలుపుతుంది. విషయం తెలుసుకున్న మేము ఉప్పాడ వైపు వెళ్లడానికి అంతగా అనుకూలం లేకపోవటంతో కృత్తివెన్ను మండలం సురక్షితమని ఇక్కడకు చేరుకున్నాం. సముద్రంలో ఉధృతి తగ్గాక తిరిగి స్వస్థలాలకు వెళతాం.
- సత్తిరాజు, ఉప్పాడ
బోట్లకు లంగరు వేశాం
సముద్రంలో వాతావరణం భయానకంగా ఉండటంతో ప్రమాదాన్ని పసిగట్టి ముందుగానే తీరానికి చేరుకున్నాం. మాతో పాటు మరో 64 బోట్లు మండలంలోని వివిధ ప్రాంతాల్లో లంగరు వేసి నిలిపాం. అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాక తిరిగి మా స్వస్థలాకు వెళతాం.
- సుబ్బారావు, ఉప్పాడ