ఇండోర్ బుకీ చెబితే!
క్రికెట్ మ్యాచైనా.. రాజకీయమైనా కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం. 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. వీటిపైనా బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. బెట్టింగ్ గురించి మాట్లాడుకుంటే.. ఇండోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నికల బెట్టింగ్‌లో జైపూర్, ముంబై తర్వాత ఇండోర్ బుకీలే ఫేమస్. ఇక్కడ బెట్టింగ్‌లో ఫెవరిట్లే ఎక్కువసార్లు విజయాలు సాధించారు. అందుకే టెన్షన్ పుట్టిస్తున్న ఈ ఎన్నికల వాతావరణంలో.. ఇండోర్ బుకీల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కాగా, ఈ సెమీఫైనల్స్ ఫలితాలపై నెలరోజుల కిందినుంచే పందేలకు తలుపులు తెరిచారు. ఇందులో.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని మొదట్లో భారీగా పందేలు కాశారు. కాంగ్రెస్‌కు 122, బీజేపీకి 90 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మెల్లగా పరిస్థితులు మారుతున్నాయి. అయితే నామినేషన్ల పర్వం ముగిశాక ఈ ఫలితాలు పూర్తిగా మారిపోతాయని బుకీలంటున్నారు.
అల్లాటప్పాయేం కాదు!
అయితే.. బెట్టింగ్ కోసం వస్తున్న అంచనాలు నోటికొచ్చినట్లుగా చెప్పరని.. కొన్ని సాంకేతిక అంశాల సాయంతోనే ఎక్కడెక్కడ ఎవరెవరు గెలుస్తారనే అంశాలపై పందెం నిర్వహిస్తామని బుకీలంటున్నారు. ఇష్టం వచ్చినట్లు బెట్టింగ్ నెంబర్లను మారుస్తామని విమర్శిస్తారు. కానీ అవన్నీ అవాస్తవాలంటున్నారు. ప్రజలతో మాట్లాడడం, నియోజకవర్గాల్లో ప్రజలనాడిని గమనించడం ద్వారా సర్వేలు చేశాకే నెంబర్లను అంచనావేస్తామన్నారు.
అయితే..
ఇండోర్ బెట్టింగ్ మార్కెట్ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేస్తుందని పేరుంది. కానీ 2015లో ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ బెట్టింగ్ ఫలితాలు అంచనాలు తప్పాయి. ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ 17 సీట్లు గెలుస్తుందని చెబితే.. ఆ పార్టీ 67 చోట్ల గెలిచింది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ 203 స్థానాలు వస్తాయంటే.. అనూహ్యంగా ఆ పార్టీ 325 సీట్లను గెలిచింది. ఈ దెబ్బకు గెలిచినవారికి డబ్బులు కట్టేందుకు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చామని నిర్వాహకులు వాపోతున్నారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ అభిప్రాయాల్లో మార్పులతో అంకెలు మారతాయని సీనియర్ బుకీ ఒకరు వివరించారు. ఫలితాలొచ్చాకే.. బెట్టింగ్‌లో గెలిచిన వారికి నగదు పంపిణీ జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యేకు ఎంకామ్ కష్టాలు!
మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సురేంద్ర పట్వాకు విచిత్రమైన కష్టమొచ్చింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో ఎంకామ్ చదివినట్లు పేర్కొన్నారు. ఇంతవరకు ఓకే కానీ ఎంకామ్‌ను ఒక్క సంవత్సరంలో పూర్తి చేసినట్లు పేర్కొనడంతోనే చిక్కొచ్చింది. 1983లో తన బ్యాచిలర్ డిగ్రీ, 1984లో ఎంకామ్ పూర్తిచేసినట్లు సురేంద్ర తన నామినేషన్లో పేర్కొన్నారు. ఈ పాయింటే ఇప్పుడు ఆయన ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. సురేంద్ర అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నారని.. ఒక్క ఏడాదిలోనే పీజీ ఎలా పూర్తి చేస్తారంటూ ఆయన ప్రత్యర్థులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన సదరు అధికారి.. మంత్రి నామినేషన్‌ను హోల్డ్‌లో పెట్టారు. విద్యార్హతతోపాటుగా మంత్రి ఆస్తుల విషయంలోనూ అఫిడవిట్లో పొరపాట్లు దొర్లాయి. తన కుటుంబం రూ.36.5 కోట్లు రుణం తీసుకున్నట్లు సురేంద్ర తెలిపారు. మరోచోట తాను చెల్లించాల్సిన రుణాలు రూ.14 కోట్లని వెల్లడించారు.
గరం గరం.. ఎన్నికల పకోడీ!
ఇటీవల కాలంలో పకోడీ ఉన్నట్లుండి ఫేమస్ అయిపోయింది. దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ, అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదని, పకోడీలు వేసుకొనైనా స్వయం ఉపాధి పొందవచ్చని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ మాటపై భగ్గుమన్న ప్రతిపక్షాలు రోడ్లపై పకోడీలు వేయడం ద్వారా తీవ్రమైన నిరసన వ్యక్తం చేశాయి. మరోపక్క, లూథియానాలో పకోడీలు వేసే ఒక చిరు వ్యాపారి లక్షల్లో ఆదాయపన్ను కట్టి అందరినీ నివ్వెర పరిచాడు. ఇలా కొన్నాళ్లుగా పకోడీ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడిదే పకోడీలను మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి బీజేపీ వాడుకుంటోంది. భోపాల్ ఎమ్మెల్యే సురేంద్రనాథ్ సింగ్ పకోడీలు వేయడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారం సందర్భంగా పకోడీలు వేసి అందరికీ పంచుతున్నారు. పకోడీలు వేయడం స్వయం ఉపాధికి, ఆత్మగౌరవానికి ప్రతీకంటూ ప్రచారం చేస్తున్నారు. అసలు పకోడీ వేయడమంటేనే ఒక కళ అని ఆయన అనుచరులంతా చెప్పుకుంటున్నారు.