చంద్రబోస్‌కు కాళోజీ స్మారక పురస్కారం
వెంగళరావునగర్ (హైదరాబాద్) : ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్‌ను మహాకవి కాళోజీ స్మారక పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ నెల 14వ తేదీనాడు రవీంద్రభారతిలో జరగనున్న కాళోజీ పురస్కార వేడుకల్లో ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు. స్థానిక మధురానగర్ కాలనీలోని తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత్ కల్చరల్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ ఈ వివరాలను వెల్లడించారు.
ఏటా టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా మహాకవి కాళోజీ స్మారక పురస్కారాలను వివిధ రంగాల్లో రాణిస్తున్న రచయితలకు అందజేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది ఈ అవార్డును సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజకు, 2014లో జేకే భారవికి అందజేసినట్టు పేర్కొన్నారు. కాగా చంద్రబోస్‌కు పురస్కారం కింద ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో పాటు రూ.10,116 నగదును అందించనున్నామన్నారు.