పారదర్శకంగా సర్వే
భయాందోళనలు అవసరం లేదు
అర్హులకే సంక్షేమ ఫలాలు
బోగస్ లబ్ధిదారుల ఏరివేత
‘ఇంటింటి సర్వే’ అవగాహన సదస్సులో మహేందర్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అక్రమార్కుల ఏరివేతే లక్ష్యంగా ‘ఇంటింటి సర్వే’ జరుగుతుందని రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అర్హులకే సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో చేపడుతున్న ఈ సర్వేకు పార్టీలకతీతంగా సహకరించాలని కోరారు. సర్వే నిర్వహణలో అపోహలకు తావులేదన్నారు. ఈ నెల 19న చేపట్టే ‘ఇంటింటి సర్వే’పై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సందేహాల నివృత్తికి శనివారం కలెక్టరేట్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే పేరుతో రేషన్‌కార్డులు ఏరివేస్తారని, స్థానికత నిర్ధారిస్తారనే ప్రచారం సరికాదన్నారు. సమాశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, జేసీ-2 ఎంవీ రెడ్డి పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
‘సర్వేను నిష్పాక్షికంగా నిర్వహిస్తాం. ఎన్యూమరేటర్ల కొరత ఉన్నా.. ప్రైవేటు ఉపాధ్యాయులు, స్కౌట్స్ అండ్ గైడ్స్సేవలను వినియోగించుకుని సమస్యను అధిగమిస్తాం. జీహెచ్ఎంసీ మినహా జిల్లాలో 7.41లక్షల ఇళ్లు ఉన్నాయి. ఈ వివరాల సేకరణకు 28,549 మందిని నియోగిస్తున్నాం. ప్రతి ఎన్యూమరేటర్‌కు సర్వే తీరు, ప్రశ్నావళిని పూరించే విధానంపై 11, 12,13వ తేదీల్లో శిక్షణ ఇస్తున్నాం.
పోలింగ్ విధుల మాదిరిగానే ఈ ప్రక్రియనూ నిర్వహిస్తాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వే ఉంటుంది. ఎన్యూమరేటర్లు సేకరించిన డేటాను మూడు వారాల్లో కంప్యూటరీకరిస్తాం. 19న ప్రభుత్వ హాలీడే ప్రకటిస్తున్నాం. స్థిరనివాసం ఎక్కడ ఉంటే అక్కడే పేర్లు నమోదు చేసుకోవడం ఉత్తమం. ఏ మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలినా.. సదరు కుటుంబ యజమానిదే బాధ్యత.
- కలెక్టర్ శ్రీధర్
ఆచరణ సాధ్యం కాదు
సామాజిక సర్వేను ఒకే రోజు పూర్తి చేయడం ఆచరణ సాధ్యం కాదు. సమాచార సేకరణలో తప్పు జరిగితే లబ్ధిదారులు నష్టపోతారు. గతంలో అధికారుల పొరపాట్లతో రేషన్‌కార్డులు కోల్పోయిన కుటుంబాలెన్నో ఉన్నాయి. ఇప్పుడూ అలాంటి తప్పిదాలే పునరావృతమైతే తిరుగుబాటు తప్పదు.
- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
సర్వే ఏమైనా భగవద్గీతా?
సర్వే సమంజసమే అయినా, దాన్ని భగవద్గీతగా భావించాల్సిన అవసరంలేదు. ప్రశ్నావళికి కుటుంబ సభ్యులిచ్చే సమాధానంలో వాస్తవం ఉందా? లేదా అనే విషయాన్ని తేల్చుకునేందుకు ఎన్యూమరేటర్ల దగ్గర డేటాబేస్‌ను అందుబాటులో ఉంచాలి.
- నాగేశ్వర్, ఎమ్మెల్సీ
గుడిసెవాసుల పరిస్థితేంటి?
హడావుడిగా సర్వే చేస్తే తప్పులుదొర్లుతాయి. మా నియోజకవర్గంలో షంషీగూడలో వందలాది గుడిసెవాసులున్నారు. వీరికి ఇంటి నంబర్లు లేవు. వీరిని ఎలా పరిగణనలోకి తీసుకుంటారు?.
- మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
సర్వేపై ఫీడ్‌బ్యాక్ తీసుకోండి
హడావుడిగా సర్వే నిర్వహించకుండా మూడు రోజుల ముందే ప్రక్రియను చేపట్టే అంశాన్ని పరిశీలించాలి. క్షేత్రస్థాయిలో ఫీడ్‌బ్యాక్ తీసుకోకుండా... ఏకపక్షంగా సర్వే నిర్ణయం తీసుకోవడంతో సహజంగానే ప్రజల్లో అపోహలకు దారితీస్తోంది.
- వివేక్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే
సీమాంధ్రుల ఏరివేతకే..
ప్రభుత్వ పథకాల జాబితా నుంచి సీమాంధ్రులను తొలగించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమర్జెన్సీని తలపించేలా ఇప్పుడు చేస్తున్న సర్వే గ్రామీణులను ఆందోళనకు గురిచేస్తోంది.
- యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే
చాలా ఆందోళనలున్నాయి
గ్యాస్ కనెక్షన్లు తొలగించడానికే సర్వే నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సర్వేలో శాస్త్రీయత పాటిం చకపోతే అనర్థాలకు దారి తీస్తుంది.
- గాంధీ, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే
పేదలను పట్టించుకోండి
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన నం దనవనం, రాజీవ్ గృహకల్ప కా లనీల్లో లబ్ధిదారుల స్థానే కొత్తవారు నివసిస్తున్నారు. సర్వే పేరి ట వారి పేర్లను తొలగించే ఆలోచనచేయకూడదు. పేదల పక్షం గా సర్వే ఉండాలే తప్ప... కార్డుల ఏరివేత లక్ష్యంగా సాగకూడదు.
- తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే
మన మంచికే
ప్రభుత్వ పథకాలు పేదలకే అందాలనే సంకల్పంతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయకుండా సర్వేకు సహకరించాలి.
- సుధీర్‌రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే
కంపెనీలకు హాలీడే ప్రకటించాలి
సర్వే రోజున పరిశ్రమలకు సెలవు ప్రకటించాలి. సర్వే సిబ్బంది కార్మికులు పనిచేసే కంపెనీల వద్దకు కూడా వెళ్లాలి.
- ప్రకాశ్‌గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే