మా విమానాలు పాక్షికంగా మేడిన్ ఇండియానే
ఎయిర్‌బస్ సీపీవో క్లాస్ రిక్టర్
న్యూఢిల్లీ: ఎయిర్‌బస్ గ్రూప్ ఉత్పత్తి చేసే ప్రతీ వాణిజ్య విమానంలోను ఎంతో కొంత భాగం మేడిన్ ఇండియాది ఉంటుందని సంస్థ చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ (సీపీవో) క్లాస్ రిక్టర్ తెలిపారు. గతేడాది భారత్ నుంచి వార్షికంగా 500 మిలియన్ డాలర్ల మేర విలువ చేసే ఉత్పత్తులు, సేవలు సేకరించాలని నిర్దేశించుకోగా, దాన్ని దాటేశామని ఆయన వివరించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించిన విదేశీ తయారీ సంస్థ భారత్‌లో ఇంత స్థాయిలో కార్యకలాపాలు సాధించడం ఇదే ప్రథమమని తెలిపారు. తాము తయారు చేసే వివిధ విమానాలకు 45 పైగా సరఫరాదారులకు చెందిన 6,000 మంది పైచిలుకు సిబ్బంది సర్వీసులు, ఉత్పత్తులు అందిస్తున్నారని రిక్టర్ పేర్కొన్నారు. 2020 నాటికి 2 బిలియన్ డాలర్ల పైచిలుకు కొనుగోళ్లు జరిపే లక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు.