రెండో ప్రపంచ ప్రేమ
ఎడిత్ స్టెయినర్ వయసు 92 ఏళ్లు. ఆమెది హంగేరి. జాన్ మ్యాకీ వయసు 96 ఏళ్లు. అతడిది స్కాట్లాండ్. మొన్న ఈ దంపతులు 71వ వాలెంటైన్స్ డేని జరుపుకున్నారు! వీళ్లదొక అపురూపమైన ప్రేమకథ. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు జర్మనీలోని ఔష్విట్జ్ క్యాంప్‌లో వందలమందిని నిర్బంధించారు. వారిలో ఎడిత్ కూడా ఒకరు. అప్పుడు ఆమె వయసు 20 ఏళ్లు. యుద్ధం అయ్యాక నిర్బంధ శిబిరాల్లో ఉన్నవాళ్లను విడిపించే క్రమంలో ఔష్విట్జ్ శిబిరానికి వెళ్లిన సైనికులలో జాన్ మ్యాకీ కూడా ఉన్నాడు. అప్పుడు అతడి వయసు 23. ఆ రోజు ఎడిత్, జాన్ ఒకర్నొకరు పరిశీలనగా చూసుకోలేదు.
'బతుకు జీవుడా' అని ఎడిత్ బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంది. జాన్ మ్యాకీ మిగతా శిబిరాల్లోని వారికి విముక్తి కల్పించే పనిలో పడిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరూ ఒక డాన్స్ హాల్లో కలుసుకున్నారు. 'ఆ రోజు థ్యాంక్స్ చెప్పలేకపోయాను' అంది ఎడిత్. 'ఇవాళ గానీ చెబుతారా ఏంటీ?' అని భయం నటించాడు జాన్. అమ్మాయి నవ్వింది. ఆ నవ్వు అబ్బాయికి నచ్చింది. ప్రేమ మొదలైంది. యుద్ధం ముగియగానే 1946లో పెళ్లయింది. వధువును స్లాట్లాండ్ తీసుకెళ్లాడు వరుడు. అప్పట్నుంచీ ఏటా వాలెంటైన్స్ డేని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ జంట డుండీ సిటీలోని కేర్ హోమ్‌లో ఉంటోంది.
ఎడిత్, జాన్ మ్యాకీ