కాంగ్రెస్‌లో కుమ్ములాటలు
నగర కాంగ్రెస్ పదవిపై పోరాటం
పీసీసీ అధ్యక్షుడి వద్ద పంచాయితీ
విజయవాడ : కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి రోడ్డునపడ్డాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడిగా పనిచేస్తున్న అడపా శివనాగేంద్రం పదవికి ఎసరు పెట్టేందుకు రెండువర్గాలు ప్రయత్నించాయి. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్దన్ నగర కాంగ్రెస్‌పై కన్నేసి పావులు కదపటం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయమైన ఆంధ్రభవన్లో సోమవారం 13 జిల్లాల స్థాయి సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే విష్ణు.. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని భోజనానికి ఆహ్వానించారు.
ఈ విందుకు నగర కాంగ్రెస్ ముఖ్య నేతలను ఆహ్వానించలేదు. నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మల్లాది విష్ణుకు ఇవ్వాలని విందులో పాల్గొన్న రఘువీరారెడ్డిని పలువురు స్థానిక నేతలు కోరారు. ఈ విషయం తెలిసిన వెంటనే అడపా శివనాగేంద్రం మద్దతుదారులు హుటాహుటిన విమానాశ్రయానికి వెళ్లి పీసీసీ చీఫ్‌కు మల్లాది విష్ణుపై ఫిర్యాదు చేశారు.
విష్ణు ఇప్పటికే పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడిగా, పీసీసీ శ్వేతపత్రాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారని రఘువీరారెడ్డికి తెలిపారు. విష్ణుకు నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని కోరారు. విష్ణుపై పలు ఆరోపణలు కూడా చేశారు. వివాదరహితుడిగా అడపాను మార్చవొద్దని కోరారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ వర్గీయులు కూడా కొందరు రఘువీరారెడ్డిని కలిసి నగర కాంగ్రెస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కడియాల బుచ్చిబాబుకు ఇవ్వాలని కోరారు.
గతంలో బుచ్చిబాబు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారని రఘువీరారెడ్డికి చెప్పారు. ఎయిర్‌పోర్టులో మూడువర్గాల నేతలు పీసీసీ నేత సమక్షంలో పంచాయితీ పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో పార్టీ ఓటమిపై ప్రత్యర్థి గ్రూపుల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు అందరిని సర్దుబాటు చేసే విధంగా మాట్లాడి చల్లగా జారుకున్నారు.