భూతదయ
పిల్లల కథ
కుంతల రాజ్యాన్ని పాలించే విక్రమసేనునకు జంతువులంటే ఎంతో ప్రేమ. అందుకోసం ప్రత్యేకంగా జంతు సంరక్షణశాలను ఏర్పాటుచేసి వాటిని సంరక్షించేవాడు. ఆ జంతు సంరక్షణశాలలో సాధు జంతువులతో పాటు క్రూర జంతువులు కూడా ఉండేవి. వాటికి శిక్షణను ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షకులు ఉండేవారు. మారువేషంలో తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని వారిని ఆదుకోవడం విక్రమసేనునకు అలవాటు.ఒకసారి విక్రమసేనుడు మంత్రి సుబుద్ధి, సైన్యాధికారి విజయునితోనూ కలసి నగర సంచారానికి బయలుదేరాడు.
వారు ముగ్గురూ కొంతదూరం ప్రయాణించేసరికి ఒక దృశ్యం వారిని కలచివేసింది. బక్కచిక్కిన గుర్రమొకటి పచ్చిక మేస్తున్నది. ఆ దృశ్యం చూడగానే విక్రమసేనుని హృదయం ద్రవించిపోయింది. విక్రమసేనుడు సైన్యాధికారి వైపు తిరిగి, ‘‘ఆ గుర్రాన్ని చూడు... ఎంత బక్కచిక్కిపోయి ఉందో, గుర్రం పోషణ చూడకుండా వీధుల్లో వదిలేసిన ఆ యజమానిని రేపు ఉదయం కొలువులో హాజరుపరుచు. ఆ గుర్రాన్ని అశ్వశాలలో కట్టు’’ అని చెప్పాడు. సైన్యాధికారి అలాగే అంటూ గుర్రం వైపు నడిచాడు.
మరునాడు గుర్రం యజమాని రమాకాంతుడిని మహారాజు ముందర హాజరుపరిచాడు సైన్యాధికారి విజయుడు. మహారాజు రమాకాంతుడిని తన వెంట రమ్మన్నాడు. మహారాజుని అనుసరించారు విజయుడు, రమాకాంతుడు. ముగ్గురూ అశ్వశాల దగ్గరకు చేరుకున్నారు. అశ్వశాలలో ఉన్న గుర్రాన్ని చూపుతూ ‘‘ఆ బక్కచిక్కిన గుర్రం నీదేనా?’’ అని అడిగాడు.
రమాకాంతుడు ‘‘అవును మహారాజా, ఆ గుర్రం నాదే!’’ అన్నాడు.
‘‘గుర్రం నీదైనప్పుడు దానిని సంరక్షించుకోవలసిన బాధ్యత నీది కాదా? గుర్రానికి తిండి పెట్టకుండా వీధుల్లో ఎందుకు వదిలేశావు?’’ అని అడిగాడు.
‘‘ప్రభువులు నన్ను క్షమించాలి. నేను చాలా పేదవాడిని, మా నాన్న దగ్గరనుండి నాకు గుర్రపు బండి సంక్రమించింది. గుర్రపుబండి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మా నాన్న దగ్గర నుండి ఈ గుర్రం ఉంది. గుర్రం ముసలిది కావడం వల్ల మనుషుల బరువును మోయలేకపోతుండటంతో మరొక గుర్రాన్ని కొని, బండికి అమర్చాను. నా సంపాదనతో రెండు గుర్రాలను పోషించలేను. అందుకే పనికిరాని ఈ ముసలి గుర్రాన్ని వీధుల్లో వదిలేశాను’’ చెప్పాడు రమాకాంతుడు.
రమాకాంతుని మాటలు వినగానే మహారాజు కోపంగా, ‘‘తల్లిదండ్రులు దైవంతో సమానులు. తల్లిదండ్రులు ముసలివారైపోయారని విడిచి పెట్టేస్తున్నామా? అలాగే వయసుడిగి ముసలివైన జంతువులను వదిలిపెట్టడం మానవత్వం అనిపించుకోదు. ఎన్నో సంవత్సరాలు నీకు సహాయం చేసిన గుర్రాన్ని విడిచిపెట్టావంటే నీలో అసలు భూతదయ లేదని అర్థమవుతోంది. భూతదయను అలవరుచుకో. నువ్వు వీధుల్లో వదిలేసిన గుర్రం ఇకమీదట ఈ అశ్వశాలలోనే ఉంటుంది. నిన్ను ఈ క్షణమే అశ్వశాలకు రక్షణాధికారిగా నియమిస్తున్నాను. ఇకపై నీ గుర్రంతో పాటు అశ్వశాలలోని గుర్రాలన్నింటి బాధ్యత నీదే!’’ అన్నాడు
మహారాజు. రాజు గారి మాటలకు రమాకాంతుడు క్షణకాలం నివ్వెరపోయి, ‘‘ప్రభూ! ఏ గుర్రాన్ని నేను చీదరించుకుని విడిచిపెట్టానో, ఆ గుర్రం వల్లనే ఈ రోజున నాకీ పదవి లభించింది. మీరు నాకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను. భూతదయను అలవరుచుకుని జంతువుల పట్ల ప్రేమతో ఉంటాను’’ అన్నాడు. మహారాజు తేలికపడ్డ మనసుతో తన మందిరానికి నడిచాడు.
- మందరపు సోమశేఖరాచార్యులు