35 ఏళ్లు దాటిన మహిళల్లో ‘సంతానలేమి’ సమస్యలు
‘నోవా’ సంస్థ సర్వేలో వెల్లడి
బెంగళూరు : భారతదేశంలో సంతానలేమితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నగరంలోని నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సంస్థ వెల్లడించింది. బుధవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ మనీష్ బాంకర్ మాట్లాడుతూ....ముఖ్యంగా 35ఏళ్లు పైబడిన మహిళల్లో అధికంగా సంతానలేమి సమస్య కనిపిస్తోందని అన్నారు. ఇటీవల తమ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు.
సంతానలేమి సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్న వారిలో 36శాతం మంది 31-35సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు కాగా, 32శాతం మంది 35సంవత్సరాలు పైబడిన మహిళలుగా తమ సర్వేలో గుర్తించినట్లు చెప్పారు. ఈ వయసు మహిళల్లో అండాల ఉత్పత్తిలో సమస్యలు ఏర్పడుతున్న కారణంగానే సంతానలేమిని ఎదుర్కొనాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇక స్పానిష్‌తో పాటు ఇతర అనేక దేశాల్లో 37ఏళ్ల వయస్సు నుంచి మహిళల్లో సంతానలేమి సమస్యలు కనిపిస్తుండగా, భారత్‌లో మాత్రం ఈ వయోపరిమితి కేవలం 31.5గానే నమోదు కావడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. అందువల్ల సంతానం విషయంలో మహిళలు మరీ ఆలస్యం చేయకపోవడమే మంచిదని సూచించారు.