Manjula Ramaswamy
-
నాట్యోపాసనం
అద్భుతం.. అమోఘం.. అపూర్వం! ఇదేంటిలా అంటున్నారు? అనుకుంటున్నారా! మంజుల రామస్వామి శిష్యబృందం నగరంలో ప్రదర్శించే వైవిధ్యమైన భరతనాట్య ప్రదర్శనను తిలకిస్తే, ఎవరైనా ఇలా అనక మానరు. ఎంతోమంది ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొన్నా.. కొన్నింటికి కొందరే లెజెండ్స్. ప్రజల హృదయాల్లో వారి స్థానం సుస్థిరం. భరతనాట్యం అనగానే తెలుగు, తమిళులకు గుర్తుకు వచ్చేది మంజులా రామస్వామే. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే మంజులను ముందుగా ఇటీవల నగరంలో ఓ అవార్డు అందుకొన్న సందర్భంగా ‘సిటీ ప్లస్’ పలుకరించింది. శ్రీరామ నాటక నికేతన్... భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాల్లో ప్రాచుర్యం పొందిన విశిష్ఠ పక్రియ భరతనాట్యం. అలాంటి దైవికమైన నృత్యం మద్రాసు రాష్ట్రంలో కొన ఊపిరితో ఉండగా, దానికి ప్రాణం పోసి, దీర్ఘాయుష్షు కల్పించేందుకు పుట్టిన సంజీవిని శ్రీరామ నాటక నికేతన్. నృత్యగురువు ‘దండయార్థపాణీ పిళ్లై’ దానికి ప్రాణం పోశారు. ప్రముఖ భరతనాట్య గురువు వీఎస్ రామమూర్తి (మా నాన్నగారు)దానిని అందిపుచ్చుకున్నారు. మా స్వస్థలం తంజావూరు. 1970లో ఇక్కడికి వచ్చాం. అప్పుడే సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో నృత్య పాఠశాల స్థాపించారు. నమస్కరిస్తా... భాషా సాంస్కృక శాఖకు చేతులెత్తి నమస్కరిస్తా. ఎందుకంటే రాష్ట్రం విడిచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మా నాన్నను, నన్ను, నా శిష్యులను అభిమానించి అక్కున చేర్చుకున్నారు. వెన్నుదన్నుగా నిలిచారు. పరాయి రాష్ట్రంవాళ్లమన్న భావనతో ఏనాడూ చూడలేదు. తల్లిలాగా ఆదరించిది హైదరాబాద్ నగరం. అలాంటి తెలుగు ప్రజల సహృదయత వర్ణించటానికి మాటలు సరిపోవు. ఇప్పుడు మేము తెలుగు బిడ్డలమే. నాన్ననే ఫాలో అవుతా... నాన్న ప్రిన్సిపుల్స్ ఉన్న వ్యక్తి. నేను ఆయననే ఫాలో అవుతా. దేశంలో, విదేశాల్లో నన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు అంటే.. అందుకు కారణం నాన్నగారే. ఆయనెప్పుడూ ఒక్కటే చెప్పేవారు ‘పిల్లలు’ (శిష్యులు)తెచ్చే అవార్డులేమనకు అవార్డులు, రివార్డులు. వాటి కోసం పరితపించకూడదు’ అని. ఆయన చెప్పిన మాటలు, చూపిన దారే నాకు ముఖ్యం. డ్యాన్స్‌తో పాటు హార్డ్‌వర్క్, విలువలు, కమిట్మెంట్ ప్రామాణికంగా శ్రీరామ నాటక నికేతన్ ముందుకు సాగుతుంది. మేం సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే అందుకు కారణం డ్యాన్సే. ఒక గంట క్లాస్‌లో ఉన్నామంటే అన్నీ మరచిపోతాం. కావాల్సిన ఎనర్జీ వస్తుంది. రెండో ఇల్లు... పిల్లలకు రెండో ఇల్లులాంటిది శ్రీరామ నాటక నికేతన్. ఏడేళ్లుదాటిన పిల్లలను చేర్చుకొంటాం. నృత్యం నేర్చుకోవడం వల్ల సహనం, ఆత్మస్థైర్యం, క్రమశిక్షణ అలవడతాయి. ‘దీపతరంగిణి’ని తొలుత దేవదాసీలు చేసేవారట. 1966లో మా నాన్నగారు ‘ప్లేట్ అండ్ ప్లాట్’ నృత్యాన్ని రివైజ్ చేశారు. ఇప్పుడు ‘దీపతరంగిణి చేస్తే మంజులా రామస్వామి శిష్యులే చేయాలి’ అని ఒక బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది. ఈ నృత్యం చేసిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. - కోన సుధాకర్‌రెడ్డి -
నాట్యమే జీవితంగా..!
ఇది రియాలిటీ షోల కాలం. టెలివిజన్ కార్యక్రమాల్లో ప్రధాన ఆకర్షణ కూడా అవే. ఆట... పాట... కలగలిసిన ఈ షోలలో... వెస్ట్రన్ డాన్సులుంటాయి... జానపద నృత్యాలుంటాయి. సామాజిక ఇతివృత్తంతో సందేశాత్మక కథనాలుంటాయి ఇవన్నీ తరచూ చూసేవే... కానీ! భారతీయ సంప్రదాయ శాస్త్రీయ నృత్యం ఉంటుందా? ఎందుకు ఉండకూడదు? ఆ ప్రశ్నకు జవాబే... మహిషాసురమర్దిని నాట్యరూపకం. ఇటీవల ఈ నాట్యం దేశవ్యాప్తంగా వీక్షకులను టీవీలకు కట్టిపడేసింది. ఈ సంప్రదాయ నాట్యరీతికి రూపకర్త మన హైదరాబాద్‌కు చెందిన మంజులా రామస్వామి!! హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతం. లక్ష్మీకళామందిర్ సినిమా థియేటర్‌కు సమీపంలో ఉంది ‘శ్రీరామ నాటక నికేతన్’. మేడ మెట్లు ఎక్కి పైకి వెళితే, గురువు మంజులా రామస్వామి శిక్షణలో దాదాపు ఇరవై మంది అమ్మాయిలు భరతనాట్యం సాధన చేస్తున్నారు. దక్షిణభారతీయత సంపూర్ణంగా మూర్తీభవించిన మహిళ మంజుల. యాభై ఏళ్లపాటు భరతనాట్యంతో మమేకమైపోయిన తాదాత్మ్యత ఆమె ముఖంలో ప్రశాంతంగా ప్రతిఫలిస్తోంది. ఆమె శిష్యబృందం ఇటీవల ఒక టెలివిజన్ చానెల్లో మహిషాసుర మర్దిని రూపకాన్ని ప్రదర్శించింది. ఇంటి వసారాలో అందంగా రంగులు వేసిన మట్టికుండలు బోర్లించి ఉన్నాయి. మరోవైపు ఆ కుండల రంగులకు సరిపోలిన స్టాండులు ఉన్నాయి. రియాలిటీ షోలో ప్రదర్శన కోసం వీటిని కూడా ముంబయి తీసుకెళ్లారు. ఒక అంశాన్ని తీసుకుని నాట్యరీతిని రూపొందించడం ఒక ఎత్తయితే, చక్కని హావభావాలతో విద్యార్థులకు శిక్షణనివ్వడం మరో ఎత్తు. ఇదంతా రక్తికట్టాలంటే కథాంశానికి తగిన నేపథ్యం ముఖ్యం. చెన్నై నుంచి హైదరాబాద్‌కి... మంజుల తండ్రి వి.ఎస్. రామ్మూర్తి మిలటరీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. 1966లో చెన్నైలో శ్రీరామ నాటక నికేతన్ పేరుతో డాన్స్ స్కూల్ స్థాపించారాయన. 1970లో ఆయనకు హైదరాబాద్‌కు బదిలీ కావడంతో డాన్సు స్కూలు కూడా హైదరాబాద్‌కి మారింది. అప్పటికి ఆమె వయసు పన్నెండేళ్లు. తండ్రి మానసపుత్రిక అయిన డాన్సు స్కూలును 40 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు మంజుల. ఆమె శిక్షణలో వందలాది విద్యార్థులు తర్ఫీదు పొందారు. అమెరికా, మలేషియా, ఆఫ్రికా, కెనడా దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. ప్రతి ప్రదర్శనలోనూ ఔరా! అని ఆశ్చర్యపరిచారు. అంతటి నైపుణ్యం ఉన్న బృందం కాబట్టేనేమో... అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఇండియా హ్యాజ్ గాట్ టాలెంట్’ రియాలిటీషోను ప్రదర్శిస్తున్న ఉత్తరాది టెలివిజన్ చానెల్ కూడా ఈ నాట్యం వైపు కెమెరా తిప్పింది. ఆడిషన్స్‌కు పిలుపు నిచ్చింది. దాంతో 42 మంది విద్యార్థులతో ముంబయికి వెళ్లి ఆడిషన్స్‌లో సెలెక్ట్ అయ్యారు. తొలి రౌండ్లో ప్రదర్శనకు గొప్ప ప్రశంసలు వచ్చాయి. రెండవ రౌండ్ అవసరం లేదని నేరుగా సెమీఫైనల్స్‌లో ప్రావీణ్యాన్ని నిరూపించుకోమని గోల్డెన్ బజర్ ఇచ్చేశారు న్యాయనిర్ణేతలు. గోల్డెన్ బజర్...తో అందరి దృష్టీ ఈ బృందం మీద కేంద్రీకృతమైంది. ఆ వేదిక మీద ప్రదర్శన ఇచ్చిన తొలి దక్షిణాది కళాకారులుగా వీరికి కొత్త గుర్తింపు వచ్చింది. గత నెల 27న సెమీఫైనల్స్‌లో మంజుల శిష్యబృందం మహిషాసురమర్దిని రూపకాన్ని ప్రదర్శించింది. ఫలితాల కోసం చూడకుండా ఫైనల్స్‌కు సిద్ధం కావల్సిందిగా సంకేతాలు వెలువడ్డాయి. కానీ ఫైనల్ రౌండ్ పోటీలో ఈ బృందానికి అవకాశం లేదు. కర్తవ్యాన్ని నిర్వహించడం వరకే మన బాధ్యత! పోటీలో ఎంతమంది ఉన్నా విజేత ఒకరేననే పరిణతి 56 ఏళ్ల మంజులారామస్వామిలో ఉంది. కానీ పది నుంచి ఇరవై ఏళ్ల లోపు చిన్నారులకు ఎలా తెలుస్తుంది? ‘మేము పొరపాటు చేశామా’ అని పిల్లలు అడుగుతుంటే ఒక గురువుగా ఆమె ఏం చెప్పాలి? మరోసారి మరింత బాగా చేద్దాం అనుకోవడానికి... ఇంతకీ ఈ ప్రదర్శనలో దొర్లిన పొరపాటు ఏమైనా ఉందా అంటే అలా ఏమీ లేదంటారు మంజుల. ‘‘మా నాన్న వి.ఎస్ రామ్మూర్తి గారే నా గురువు. ‘ప్రదర్శన పదిమంది ఎదుట అయినా, వేలాదిమంది ఎదుట అయినా నీ నైపుణ్యాన్ని వందకు వందశాతం ప్రదర్శించాల్సిందే. ప్రశంసల కోసం ఎదురు చూడకూడదు. నీ బాధ్యత నిర్వహించావనేది మాత్రమే స్మృతిలో ఉండాల’ని ఆయన చెబుతుంటారు. ఈ సందర్భంగా నేను అనుకుంటున్నదీ అదే. ఇక మీదట న్యాయనిర్ణేతల తీర్పు, మొబైల్ ఫోన్ల నుంచి ఓట్లు వేయడం వంటివన్నీ పారదర్శకంగా చూపించే రియాలిటీషోకి మాత్రమే నా విద్యార్థుల్ని తీసుకెళ్తాను’’ అన్నారామె. ఈ షో కోసం పిల్లలు 17 రోజులు ఇంటికి దూరంగా ఉన్నారు. పోటీలు రాత్రి జరిగితే రోజుకు కేవలం రెండు గంటల నిద్రతో పనిచేశారు. జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను చూశారు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏమిటంటే... ఫలితాలు ఊహించని విధంగా ఉన్నప్పటికీ వాళ్ల ముఖంలో ప్రసన్నతను చెదరనివ్వలేదు. అంతటి నిగ్రహశక్తిని ఈ వయసులోనే తెచ్చుకున్నారు’’ అన్నారామె. భరతనాట్యం కోసం జీవితాన్ని అంకితం చేసిన మంజులకు భరతనాట్యాన్ని గెలిపించడమే లక్ష్యం. అందుకోసం కొత్త అంశాలతో ఎన్ని నాట్యరూపకాలను తయారు చేయడానికైనా ఆమె సిద్ధమే. - వాకా మంజులారెడ్డి, మట్టి కుండలపై వలయాకారంగా... మహిషాసుర మర్దిని రూపకంలో మట్టికుండల మీద నిలబడి చేతిలో దీపాలు పట్టుకుని భరతనాట్యం చేశాం. ఫైనల్స్ కోసం భ్రామరీ అంశాన్ని సాధన చేశాం. అందులో మట్టికుండలపై నిలబడి వలయాకారంగా తిరగాలి. కానీ దాన్ని ప్రదర్శించే అవకాశం లేకపోయింది. - సత్య ప్రసూన నాట్యమే నా ఊపిరి! ‘తెలుగు నేలకు మనం చేయాల్సింది చాలా ఉంది’ అని నాన్నగారు చెప్తుంటారు. ఆయనకు 94 ఏళ్లు. ఇప్పటికీ ఆయన నాతో మాట్లాడేది భరతనాట్యం గురించే. కనీసం ఆయన మాటకోసమైనా, ఓపికున్నంత వరకు నాట్యకళాకారులను తీర్చిదిద్దడానికే శ్రమిస్తాను. - మంజుల