కదం తొక్కారు
నెల్లూరు (సెంట్రల్), న్యూస్‌లైన్ : సమైక్య ఉద్యమజ్వాల రోజురోజుకూ జిల్లాలో ఎగిసి పడుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉద్యమం బుధవారం ఉవ్వెత్తున ఎగిసింది. పల్లె మొదలుకుని పట్టణం వరకు ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు కారకులైన సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేస్తున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నెల్లూరులో బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు స్వగృహాన్ని ముట్టడించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులా ట చోటుచేసుకుంది. సమైక్యాంధ్రపై ఎలాంటి ప్రకటన చేయని మంత్రి రామనారాయణరెడ్డిని ప్రజలు నిలదీ స్తారనే ముందు జాగ్రత్తతో పోలీసులు చూపిన అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ నుంచి భారీ ప్రదర్శనగా వెళ్లి మినీబైపాస్‌రోడ్డులో వంటావార్పు నిర్వహించారు.
బుజబుజనెల్లూరులో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళి, వైఎస్సార్సీసీ సీఈసీ సభ్యుడు, నెల్లూరు నగరం, రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో హైవేపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ బారులుతీరాయి. సమైక్య విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్‌పై రాస్తారోకో నిర్వహించారు. వీఎస్‌యూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ భారీగా సాగిం ది. ఎన్జీఓ అసోసియేషన్ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులను విధులను బహిష్కరించేలా చేసి నిరసనలు వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సం యుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు.
కావలి లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు జెండా సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వర కు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మద్దతు ప్రకటించారు. దీంతో పాటు న్యాయవాదులు, ట్రక్కు ఆటో డ్రైవర్ల యూనియన్లు, ఎన్జీఓలు ప్రత్యేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ముత్తుకూరులో విద్యార్థి, యువజన సంఘాలు బస్టాండ్ కూడలిలో మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే పొదలకూరులో ట్రక్కు ఆటోల ప్రదర్శన, మనుబోలు, వెంకటాచలంలలో విద్యార్థులు రాస్తారోకోలు నిర్వహించారు. వెంకటగిరిలో జర్నలిస్టుల సంఘం, సమైక్య పోరాట సమితి ఆధ్వర్యంలో కాశీపేట సెంటర్లో సోనియా బొమ్మకు నిప్పంటించారు. సైదాపురంలోని సీఆర్ఆర్ కళాశాల విద్యార్థులు సోనియా చిత్రపటానికి శవయాత్ర చేసి శాస్త్రోక్తంగా కర్మకాండలు నిర్వహించారు. వింజమూరులోని కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు గంటపాటు రాస్తారోకో నిర్వహించడంతోపాటు కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఉదయగిరిలో జర్నలిస్టులు తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో రిలే నిరాహార దీక్షకు దిగారు. వరికుంటపాడు, సీతారాంపురం మండలాల్లో విద్యార్థులు వైఎస్సార్సీపీ నేతలు వంటా వార్పుల ద్వారా తమ నిరసనను వ్యక్తం చేశారు. కోవూరులో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నారు.
బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరులలో సమైక్యాంధ్ర, జేఏసీల ఆధ్వర్యంలో ర్యాలీల ద్వారా నిరసనలు కొనసాగించారు. సూళ్లూరుపేటలో ఆర్టీసీ జేఏసీ, వ్యవసాయ శాఖాధికారులు, పెన్షనర్ల అసోసియేషన్, వైఎంఆర్సీ క్లబ్‌ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. నాయుడుపేటలో ఎమ్మెల్యే పరసారత్నం సమైక్యాంధ్ర కోరుతూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెళ్లకూరు, ఓజిలి, దొరవారిసత్రంలలో కూ డా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. గూడూరులో మత్స్యకార మహిళలు కేసీఆర్ బొమ్మకు శవయాత్ర నిర్వహించి క్లాక్ టవర్ వద్ద దహనం చేశారు.
సమైక్యాంధ్ర ఉద్యమకారులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్రసాద్‌రావు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గూడూరులో సమైక్యాంధ్ర జేఏసీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు పాశం సునీల్ కుమా ర్, బాలచెన్నయ్య కూర్చొని తమ మద్ద తు ప్రకటించారు. ట్రాన్స్‌కో సిబ్బంది డీఈ కార్యాలయం ఎదుట ఆందోళనలతో నిరసన వ్యక్తంచేశారు. చిట్టమూ రు, కోట మండలాల్లో సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.