అమెరికాలో అగ్రనేతల భేటీ
చైనా అధ్యక్షుడికి ట్రంప్ విందు
వాషింగ్టన్/పామ్ బీచ్: చైనా తమ అర్థిక వ్యవస్థను దోచుకుంటోందని ఇటీవలి వరకు తీవ్ర విమర్శలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయనతో గొప్ప అనుబంధం మొదలు కాబోతుందని పేర్కొన్నారు. భార్యతో సహా రెండురోజుల అమెరికా పర్యటనకు వచ్చిన జిన్ పింగ్‌కు ట్రంప్ ఫ్లోరిడాలోని తన మారా లాగో రిసార్టులో విందు ఇచ్చారు.
జిన్ పింగ్‌ను, ప్రముఖ గాయకురాలైన ఆయన భార్య పెంగ్ లియూయాంగ్ అమెరికాకు వచ్చినందుకు గర్వంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. జిన్ పింగ్‌తో తనకు గొప్ప అనుబంధం మొదలుకాబోతోందని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. ఈ ఏడాదిలో తమ దేశంలో పర్యటించాలని జిన్ పింగ్ కోరగా ట్రంప్ అందుకు అంగీకరించారు. ఇరు దేశాల సంబంధాలు ఫలవంతం అవుతాయని, వాటికి భంగం కలిగే అవకాశం లేదని జిన్ పింగ్ అన్నారు.