సెన్సెక్స్ తొలి నిరోధం 23,940 పాయింట్లు
మార్కెట్ పంచాంగం
మార్కెట్ ఓవర్‌సోల్డ్ కండీషన్లో పడినట్లు టెక్నికల్స్ వెల్లడిస్తున్నందున, రిలీఫ్ ర్యాలీ జరగవచ్చంటూ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన అంచనాలకు అనుగుణంగా మార్కెట్ పెరిగింది. చైనా మార్కెట్ పునఃప్రారంభమైన తర్వాత స్థిరంగా ట్రేడ్‌కావడం, అమెరికా మార్కెట్లు కూడా ర్యాలీ జరపడం ఇక్కడ షార్ట్ కవరింగ్‌కు దోహదపడింది. ఇక కేంద్ర బడ్జెట్ సమర్పణకు వారం రోజులే గడువు వుంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ సంకేతాలతో అల్లాడిపోయిన మన మార్కెట్ బడ్జెట్ పట్ల అంచనాల్ని ఏర్పర్చుకుని, అందుకు తగ్గ కొనుగోళ్లు, అమ్మకాలు జరపడానికి కేవలం ఐదు ట్రేడింగ్ రోజులే మిగిలివుంది.
సరిగ్గా ఇదేవారంలో ఫిబ్రవరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు కూడా ముగియనున్నాయి. ఇటు షార్ట్ కవరింగ్, అటు లాంగ్, షార్ట్ రోలోవర్స్ కారణంగా మార్కెట్లో ఆయా షేర్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాంశాలకు వస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు
ఫిబ్రవరి 19తో ముగిసినవారం ప్రధమార్థంలో బీఎస్ఈ సెన్సెక్స్ 22,921 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినా, ద్వితీయార్థంలో కోలుకోవడంతో అంతక్రితం వారంతో పోలిస్తే 723 పాయింట్ల లాభంతో 23,709 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం మొదలైన రిలీఫ్ ర్యాలీ ఈ వారం కూడా కొనసాగితే 23,940 పాయింట్ల వద్ద తొలి అవరోధం కలగవచ్చు.
అటుపైన స్థిరపడితే క్రమేపీ 24,225 పాయింట్ల స్థాయివరకూ పెరిగే ఛాన్స్ వుంది. ఈ వారం తొలి నిరోధాన్ని అధిగమించలేకపోతే 23,440 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే గతవారపు కనిష్టస్థాయి అయిన 22,921 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఆ స్థాయి దిగువన మరోదఫా 22,600 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ నిరోధం 7,275
ఎన్ఎస్ఈ నిఫ్టీ అంతక్రితం వారంతో పోలిస్తే 230 పాయింట్ల లాభంతో 7,211 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రిలీఫ్ ర్యాలీ కొనసాగితే 7,275 పాయింట్ల వద్ద తొలి అవరోధం ఎదురుకావొచ్చు. అటుపైన స్థిరపడితే క్రమేపీ 7,365 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోతే 7,120 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును ముగింపులో కోల్పోతే క్రమేపీ 6,960 పాయింట్ల స్థాయి వరకూ తగ్గవచ్చు. ఆ లోపున మరోమారు 6,870 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
ఈ వారం ఫిబ్రవరి డెరివేటివ్ సిరీస్ ముగింపు సందర్భంగా 7,300, 7,400 స్ట్రయిక్స్ వద్ద అత్యధికంగా 58,44 లక్షలు, 60.51 లక్షల చొప్పున కాల్స్ బిల్డప్ జరిగింది. అలాగే 7,200, 7,000 స్ట్రయిక్స్ వద్ద భారీగా 50,56 లక్షలు, 53.63 లక్షల మేర పుట్స్ బిల్డప్ జరిగింది. 7,300 పాయింట్ల స్థాయిని దాటితే నిఫ్టీ మరింత పెరగవచ్చని, 7,400 పాయింట్ల స్థాయిని అధిగమించడం మాత్రం కష్టసాధ్యమని ఈ డేటా వెల్లడిస్తున్నది. 7,200 స్థాయిని కోల్పోయి, ముగిస్తే 7,000 పాయింట్ల స్థాయివరకూ పెద్దగా మద్దతు లేదని కూడా ఈ డేటా సూచిస్తున్నది.