జ్ఞాపకాల పందిరి.. విషాద లోగిలి
పెళ్లి పుస్తకంలో ఓ పేజీ రక్తసిక్తమైంది. వధూవరులు.. బంధుమిత్రుల రాకతో మధురజ్ఞాపకాలు మిగిల్చాల్సిన తిరుగుపెళ్లి విషాదం నింపింది. ఓ గంట గడిస్తే.. సంబరం అంబరాన్నంటాల్సిన ఆ ఇల్లు శోకసంద్రమైంది. ఆనందాలకు స్వాగతం పలుకుదామని ఒళ్లంతా కళ్లుచేసుకున్న మామిడి తోరణం ముడుచుకుపోయింది. ఆ జంట జీవితంలో సరికొత్త రాగం ఆలపించాల్సిన పాట మూగబోయింది. పెళ్లి ముచ్చట్లతో సాగుతున్న ఆ ప్రయాణాన్ని మృత్యువు అడ్డగించింది. మలుపులో మాటేసి పంజా విసిరింది. వందేళ్ల జీవితానికి సాక్ష్యంగా నిలవాల్సిన రోజు.. ఆరుగురిని పొట్టనపెట్టుకుంది.
మహానంది: కర్నాలు-ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం అర్ధరాత్రి పెళ్లి బృందం లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 42 మంది క్షతగాత్రులు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన శిరీషకు గిద్దలూరు పట్టణంలోని చట్రెడ్డిపల్లెకు చెందిన నరసయ్యతో ఈనెల 18న వివాహమైంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు తిరుగుపెళ్లి నిమిత్తం వధూవరులతో పాటు బంధుమిత్రులు సుమారు 50 మంది లారీలో బయలుదేరారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నల్లమలలోని పాత రైల్వే బ్రిడ్జి వద్దనున్న మలుపులో అదుపుతప్పిన లారీ కొండను ఢీకొంది.
ఘటనలో చట్రెడ్డిపల్లెకు చెందిన తిరుపాలు(55), ప్రభాకర్(33), ఏసోబు(39), బోయలకుంట్లకు చెందిన ఉడుముల జయమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందగా.. చట్రెడ్డిపల్లెకు చెందిన గడ్డం వెంకటయ్య(34), మొలక కృష్ణ(20)లు గిద్దలూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 31 మందికి తీవ్ర గాయాలు కాగా.. కర్నూలు, నంద్యాల, ఒంగోలు, నరసరావుపేట, గిద్దలూరులో చికిత్సనందిస్తున్నారు. వీరిలోనూ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పెళ్లికూతురు స్వగ్రామం గోపవరంలో విషాదం అలుముకుంది.