పెళ్లి వ్యాను బోల్తా
ఆవిరైన ఆనంద క్షణాలు
పెదతాడేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా దుర్ఘటన
ఇద్దరు మృతి, 13 మందికి గాయాలు
పెళ్లి వేడుక ముగిసింది. బంధుమిత్రుల తిరుగు ప్రయాణం మొదలైంది. పెళ్లి బృందం ముచ్చట్లలో మునిగి తేలుతోంది. ఇంటికెళ్లిపోతున్నామన్న ఆనందం ముఖాల్లో తాండవిస్తోంది. అంతలోనే ఒక్క కుదుపు.. 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వ్యాన్ టైరు పేలిపోయి తిరగబడింది. అక్కడికక్కడే ఒకరు, ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరిని బలి తీసుకుంది. పదమూడు మంది క్షతగాత్రులయ్యారు. భీమడోలుకు చెందిన గుంటూరు మస్తాన్ కుమారుడి పెళ్లికి తీపర్రు వెళ్లి వస్తున్న పెళ్లి బృందం గురువారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి బెస్టు కళాశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో షేక్ ఇబ్రహీం (18) అక్కడికక్కడే కన్నుమూశాడు. కలపాల చిన సుబ్బారావు (52)ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. క్షతగాత్రుల హాహాకారాలతో, బంధువుల రోదనలతో సంఘటన స్థలం దద్దరిల్లింది.
తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), పెంటపాడు
భీమడోలుకు చెందిన షేక్ మస్తాన్ (గుంటూరు మస్తాన్) కుమారుడు ఇస్మాయిల్ వివాహం పెరవలి మండలం తీపర్రుకు చెందిన యువతితో గురువారం ఉదయం జరిగింది. అనంతరం భోజనాలు ముగిశాయి. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, ముఖ్యమైన బంధువులు వేరే వాహనంలో వచ్చేందుకు పెండ్లివారి ఇంట ఉన్నారు. వివాహానికి వచ్చిన వారు 16 మంది వ్యాన్‌లో బయల్దేరారు. ఈ వ్యాన్ పెదతాడేపల్లి బెస్టు కళాశాల సమీపిస్తున్న సమయంలో వెనుక టైరు పేలిపోయింది. దీంతో వ్యాన్ నడుపుతున్న గుబ్బల శ్రీను వ్యాన్‌ను నియంత్రించే ప్రయత్నంలో ఉండగా వెనుక ఉన్న రెండో చక్రం పేలిపోయి వాహనం ఒక్కసారిగా పల్టీ కొట్టింది.
వ్యాన్ టైర్లు పేలినప్పుడు చిరు నిప్పురవ్వలు రేగినట్టు ఆ ప్రాంతంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారు చెబుతున్నారు. వ్యాన్‌లో ఉన్న వారిలో షేక్ ఇబ్రహీం (18) అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌తో సహా మిగిలిన వారికి గాయాలయ్యాయి. వీరందరినీ తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని తణుకు తదితర ప్రాంతాల్లోని ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ఇబ్రహీం తండ్రి నాగూర్ వద్ద మాంసం దుకాణంలో సహాయకుడిగా పనిచేసే కలపాల చిన సుబ్బారావు (52)ను తణుకు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్ఐ కె.రామారావు క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి పంపించారు.
సహాయక చర్యల కోసం తాడేపల్లిగూడెం 108 అంబులెన్సుకు ఫోన్ చేసినా వాహనం అక్కడికి చేరుకోలేదు. దీంతో భీమడోలు నుంచి వచ్చిన అంబులెన్సులో క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించారు. హైవే అంబులెన్సు సిబ్బంది సహకారంతో వ్యాన్‌ను క్రేన్లతో లేపారు. ఏరియా ఆస్పత్రిలో క్షత గాత్రులకు సత్వర సాయం అందించడంలో మున్సిపల్ ైచె ర్మన్ బొలిశెట్టి శ్రీనివాసు, బీజేపీ జిల్లా కార్యదర్శి కంచుమర్తి నాగేశ్వరరావు, మంత్రి మాణిక్యాలరావు కార్యాలయ పీఆర్ఓ చిట్యాల రాంబాబు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ బాజీలు సహకారం అందించారు.
నువ్వు లేనప్పుడు మా బతుకెందుకు
‘బిడ్డా రాత్రే కొత్త బట్టలు కొన్నానే. అవి కట్టుకున్న ముచ్చట తీరకుండానే వెళ్లిపోయావా నాయనా. నా బిడ్డను నాకు తెచ్చివ్వు భగవంతుడా’ అంటూ పెదతాడేపల్లి బెస్టు కళాశాల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన షేక్ ఇబ్రహీం తల్లి సైదాబీ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. నా బిడ్డా.. నా బిడ్డా అంటూ గుండెలు బాదుకుంటూ ఆమె రోదించడం కలచివేసింది. సంఘటన స్థలం నుంచి ఏరియా ఆస్పత్రికి చేరుకున్నాక కూడా ఆమె విలపిస్తూనే ఉంది. ‘చిన్న కొడుకేడి? నా కొడుకు లేకపోతే బతకను. నీ కెందుకులే నేనున్నానమ్మా అంటూ చేయి పట్టుకొని తిరిగే వాడు. వాడే లేనప్పుడు మా బతుకెందుకు?’ అంటూ తల్లి సైదాబీ, తండ్రి నాగూర్ షాహేబ్ కన్నీరుమున్నీరయ్యారు. ‘అన్నయ్యా అని ప్రేమతో పిలిపించుకొనే భాగ్యం ఇక లేదా’ అంటూ ఇబ్రహీం సోదరుడు కూడా రోదించాడు.