‘మూకుమ్మడిగా సెలవులు పెడతాం’
నెల్లూరు: తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించనందున సోమవారం వైద్య సేవలు ఆపేసి మూకుమ్మడి సెలవులు పెడుతున్నట్లు, ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసన్ తెలిపారు. శనివారం స్ధానిక పెద్దాసుపత్రి వద్ద డాక్టర్లు ఐదోరోజు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు తమతో మాట్లాడేందుకు సిద్ద పడలేదన్నారు.
అందువల్ల తప్పని పరిస్థితుల్లో వైద్యసేవలు బాయ్‌కట్ చేస్తున్నామన్నారు. అత్యవసర సేవలకు మాత్రం తమ సహకారముంటుందన్నారు. ఇప్పటికైనా ఆస్పత్రుల్లో ఖాళీపోస్టులను భర్తీ చేయాలని, వైద్య పరికరాలను అందుబాటులోనికి తీసుకురావాలని, టైం బౌండ్ ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే డాక్టర్లపై వేధింపులను ఆపాలని, బయోమెట్రిక్‌ను రద్దు చేయాలని కోరారు.
ఆదివారం తిరుపతిలో అసోసియేషన్ నాయకులు సమావేశమవుతున్నామని, మంగళవారం నుంచి చేయబోయే ఆందోళనలకు సంబంధించి చర్చిస్తామన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోతే అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సాధారణ సేవలను స్తంభింపచేస్తామని హెచ్చరించారు.