మారిషస్ లో వేంకటేశ్వర స్తోత్రాలు
మాతృభూమికి దూరంగా ఉంటున్నప్పటికీ మారిషస్ లోని తెలుగువారు తమ సంప్రదాయాలను పదిలంగా కాపాడుకుంటున్నారు. పండుగలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఉనికిని చాటి చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రవాస తెలుగువారిని భక్తిసాగరంలో ఓలలాడించింది.
మారిషస్ చరిత్రలో తొలిసారిగా చిన్నారులతో శ్రీ వేంకటేశ్వరస్వామి స్తోత్రముల ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 4 నుంచి 13 ఏళ్ల బాల బాలికలు 450 మంది రాగ, తాళ, భావ, అర్థయుక్తంగా ఆలాపించిన స్తోత్రములు భక్తులకు వీనులవిందు చేశాయి. జూలై 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాసులకు పరమానందం కలిగించింది.
లేస్కలియే, వల్లెట్ట, పాంప్లెముసేజ్ తెలుగు సంఘాలు ఈ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో ఎంపిక చేసిన చిన్నారులకు తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల, హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, భద్రాచలంలో పాడేందుకు చిన్నారులకు అవకాశమిచ్చారు.