తెలంగాణ సినిమా ఉద్యమంలా ఎదగాలి
సప్తగిరికాలనీ : వలసవాద దోపిడీ నుంచి విముక్తి పొందిన తెలంగాణ రాష్ట్రంలో సినిమా రంగం స్వతంత్రంగా ఉద్యమంలా ఎదగాలని కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ అన్నారు. మంగళవారం ఎస్సారార్ కళాశాల సత్యజిత్ రే ఫిలిం క్లబ్, కరీంనగర్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘తెలంగాణ సినిమా.. దశ దిశ సదస్సు’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాకారులు, రచయితలు తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ తెలంగాణ సినిమాను అంతరాతీయస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
కళాకారులందరినీ ఒకేవేదికపైకి తీసుకు రావాలన్నారు. ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సినిమాలో తెలంగాణ కళాకారుల పాత్ర అత్యంత దయనీయమైనదన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పే ప్రయత్నం తెలంగాణ సినిమా ద్వారా జరుగుతోందని అన్నారు. సినీ విమర్శకులు వారాల ఆనంద్ మాట్లాడుతూ తెలంగాణ ఫిలిం పాలసీ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఫిలిం ఇనిస్టిట్యూట్, ఫిలిం డెవ లప్మెంట్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ అధ్యక్షులు సయ్యద్ ముజఫర్, శ్రీరాముల సత్యనారాయణ, గండ్ర లక్ష్మణ్‌రావు, రవీందర్రావు, శ్రీనివాస్, సత్యనారాయణ, విజయరావు, దీప్తిరెడ్డి, రాజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.