'వందేళ్లు దాటాక వారి మనోవాంఛ తీరింది'
వాషింగ్టన్: ఎట్టకేలకు అలస్కా ప్రజల మనోవాంఛ నెరవేరింది. ఎప్పుడు తాము సాంప్రదాయబద్ధంగా పిలుచుకునే పేరుకు అధికారిక గుర్తింపునిస్తారా అని ఎదురుచూసిన వారికి చివరికి సంతృప్తి కలిగింది. తమ ప్రాంతంలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వతానికి తమకు నచ్చిన పేరును ధృవీకరిస్తూ అమెరికా వైట్ హౌస్ ఓ ప్రకటన చేసింది. అసలు ఇంతకి ఏమిటి ఆ విషయం అనుకుంటున్నారా.. ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైన పర్వతం ఏదంటే టక్కున మెకిన్లీ అని ఈ రోజుల్లో కాంపిటేషన్‌కు ప్రిపేర్ అవుతున్న ఎవ్వరైనా చెప్పేస్తారు. వాస్తవానికి ఆ పేరు ఎందుకు పెట్టారో ఎప్పుడు పెట్టారో తెలుసా సరిగ్గా 1896లో. నాటి అమెరికా అధ్యక్షుడు విలియం మెకిన్లీకి గుర్తుగా. కానీ అంతకుముందు ఆ పర్వతానికి 'దెనాలి' అనే పేరుండేది.
అయితే, మెకిన్లీ అని ఆ పర్వతానికి నామకరణం చేసినప్పటి నుంచి అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాని పేరు తిరిగి దెనాలిగా మార్చాలంటూ పలుమార్లు డిమాండ్లు, నిరసనలు వ్యక్తం చేశారు. పేరు మార్చడం ద్వారా తమ సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవించిన వారవుతారని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు ఎవరూ సరిగా వారి డిమాండ్‌ను పట్టించుకోలేదు. కొంతమంది ఆ దిశగా ఆలోచనలు చేసిన ఆచరణలోకి రాలేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అలస్కా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆ పర్వతం పేరును మెకిన్లీగా తొలగించి దెనాలిగా స్పష్టం చేశారు. ఒబామా ఇక్కడ మూడు రోజులు గడపనున్నారు.