ఎన్నికల్లో వైద్య అభ్యర్థులను గెలిపించాలి: ఐఎంఏ
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పోటీ చేస్తున్న వైద్య అభ్యర్థులను పార్టీలకు అతీతంగా గెలిపించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) పిలుపునిచ్చింది. సోమవారం కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎంఏ నేషనల్ లీడర్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ అప్పారావు, ఐఎంఏ సీజీపీ డీన్ డాక్టర్ పుల్లారావుతో కలసి ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం.యాదగిరిరావు మాట్లాడారు.
తెలంగాణలో ఈనెల 30న, సీమాంధ్రలో మే 7న జరిగే ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 100 మందికి పైగా వైద్యులు పోటీ చేస్తున్నారన్నారు. వీరికి రాష్ట్రంలోని 167 బ్రాంచీల్లో ఉన్న 24 వేల ఐఎంఏ వైద్యులు, వారి కుటుంబాలు మద్దతివ్వాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్(సీపీఏ), క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్(సీఈఏ)లను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.