అభిమానులకు రజనీకాంత్ విజ్ఞప్తి
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై రాష్ట్రంలో మరోసారి దుమారం రేగింది. ఈ నేపథ్యంలో తన కార్యచరణ ఏంటన్నది తెలిపేందుకు చెన్నైలో ఈ నెల 12 నుంచి 16 తేదీల మధ్య రాఘవేంద్ర కళ్యాణ మండపంలో సమావేశాలు నిర్వహించాలని భావించారు. అనివార్య కారణాల వల్ల అభిమానులతో సమావేశాలను రద్దు చేసుకుంటున్నట్లు సూపర్ స్టార్ రజనీ ప్రకటించారు. తమిళనాడులో జిల్లాల వారీగా విడిగా సమావేశాలు నిర్వహించి అందులో పాల్గొటానని తెలిపారు.
ఈ నెల 12-16 తేదీలలో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో నిర్వహించే ఈ సమావేశాల్లో ప్రతి ఒక్క అభిమాని తనను నేరుగా కలిసి ఫొటో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారని ఆయన తెలుసుకున్నారు. ప్రతి ఒక్క అభిమానితో ఫొటో దిగడం సాధ్యం కాదని స్పష్టం చేసిన రజనీకాంత్.. జిల్లాల వారీగా సమావేశాలలో పాల్గొంటానని చెప్పారు. అప్పుడు అందరికీ తనను కలిసే వీలు కుదురుతుందని.. దయచేసి అభిమానలు తన పరిస్థితిని అర్థం చేసుకోగలరని కోరారు.
మరోవైపు జయలలిత మృతితో ఖాళీ ఏర్పడ్డ ఆర్కే ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 12న జరగనుంది. అయితే అదేరోజు ప్రారంభం కానున్న సమావేశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. అవి రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో అనివార్య కారణాలతో రజనీ తన సమావేశాలను రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ 2న అభిమానులతో తొలిసారి సమావేశం అవ్వాల్సి ఉన్నా రద్దు చేసుకున్నారు.