అన్న చేతిలో తమ్ముడు హతం
రాజుపాళెం: తొండలదిన్నె గ్రామానికి చెందిన దేవగుడి మహబూబ్ బాషా (35) అనే రైతు ఆయన తమ్ముడు దేవగుడి దస్తగిరిని శుక్రవారం ఉదయం హత్య చేశాడు. మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం అందించిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దస్తగిరి, హతుడు మహబూబ్ బాషా ఇద్దరు అన్నదమ్ములు. వీరికి దువ్వూరు మండలంలోని పెద్దజొన్నవరం గ్రామ సమీపంలోని కుందూనది దగ్గర్లో వరి మాగాణి పొలం ఉంది.
ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య వరిమడి గెట్టుకు సంబంధించి తగాదా జరిగింది. శుక్రవారం ఉదయం మహబూబ్ బాషా వరి పంటను చూసేందుకు వెళ్లాడు. ఆయన సోదరుడు దస్తగిరి పొలంలో నుంచి నీళ్లు రావడంతో అడిగారు. అక్కడ ఇరువురి మధ్య మాటకుమాట పెరిగింది. తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దస్తగిరి తన చేతిలో ఉన్న పారతో తమ్ముడైన మహబూబ్ బాషా తలపై కొట్టడంతో మృతి చెందాడు. తలపై బలమైన గాయం తగలడంతో మెదుడు చితికి పోయింది. సంఘటనపై కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మైదుకూరు డీఎస్పీ:
మహబూబ్ బాషా మృతి చెందిన సంఘటనా స్థలాన్ని మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య, అర్బన్, రూరల్ సీఐలు వెంకటేశ్వర్లు, నాగభూషణం, ఎస్ఐ మధుసుదన్‌రెడ్డి, ఏఎస్ఐ నాగన్న, పోలీసులు రమణారెడ్డి పరిశీలించారు. మృతునికి భార్యతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముందు నుంచి అన్నదమ్ములు పొలం విషయంపై మాట్లాడుకోవడం లేదని తెలిసింది. మృతుడు మహబాబ్‌బాషా ఆయన తండ్రి నాగయ్యతో కలిసి ఉంటున్నాడు. నిందితుడు దస్తగిరి వేరే ఇంట్లో నివాసం ఉన్నాడు. హతుడు తండ్రి, భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు.