ఎన్ఐఏ కస్టడీకి ‘మెహ్దీ’?
బెంగళూరు : ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ట్విట్టర్ ద్వారా సందేశాలు పంపుతున్నారనే ఆరోపణలపై అరెస్టైన మెహ్దీ మస్రూర్ బిశ్వాస్‌ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) అధికారులు కస్టడీకి తీసుకోంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం బెంగళూరు సీసీబీ పోలీసుల అదుపులో ఉన్న మెహ్దీ విచారణ సందర్భంలో దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అత్యంత ప్రముఖమైన సమాచారాన్ని వెల్లడిస్తున్న నేపథ్యంలో మెహ్దీని తమ కస్టడీకి తీసుకునేందుకు ఎన్ఐఏ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ అంశంపై ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే డీజీపీ లాల్‌రుఖుమ్ పచావోతో పాటు నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డిని సైతం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వారాంతంలోపు ఎన్ఐఏ అధికారులు బెంగళూరుకు వచ్చి మరింత సమాచారాన్ని మెహ్దీ నుంచి సేకరించే దిశగా అతన్ని ఢిల్లీకి తీసుకువెళ్తున్నట్లు సమాచారం.
మెహ్దీ ట్విట్టర్ నుంచి వివిధ దేశాలకు మొత్తం 1,29,000 సందేశాలు వెళ్లాయని, ఈ ట్విట్టర్ అకౌంట్‌కు తిరిగి అన్నే సందేశాలు వచ్చాయని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. కాగా మెహ్దీ ట్విట్టర్ ద్వారా పంపిన సందేశాలతో ప్రేరేపితమైన దాదాపు 20 మంది యువకులు ఇప్పటికే సిరియాకు చేరుకొని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్లు పోలీసులు సమాచారాన్ని సేకరించారు. ఇక ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్త దక్షిణ భారత్‌లో దాడులకు పాల్పడనుందనే సమాచారం సైతం మెహ్దీ వద్ద ఉందనే విషయాన్ని తెలుసుకున్న ఎన్ఐఏ అధికారులు మెహ్దీని తమ కస్టడీకి తీసుకొని ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించేందుకు సన్నద్ధమవుతున్నారు.
పాస్వర్డ్ మరిచిపోయా
ఇక సీసీబీ పోలీసుల కస్టడీలో ఉన్న మెహ్దీ తాను ఉపయోగించిన మరో రెండు ట్విట్టర్ అకౌంట్లు, మూడు ఈమెయిల్స్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లపై నోరు విప్పడం లేదని తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో విచారణకు సహకరిస్తున్న మెహ్దీ ఈ పాస్‌వర్డ్‌లకు సంబంధించి మాత్రం ‘నేను ఆ పాస్వర్డ్స్ మరిచిపోయాను’ అని చెబుతున్నట్లు సమాచారం.