రచ్చబండలో తెలంగాణవాదుల నిరసన
హుజూర్నగర్, న్యూస్‌లైన్: పట్టణంలోని స్వర్ణవేదిక ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. కార్యక్రమం వేదికపై ముఖ్యమంత్రి ఫొటోతో అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని జేఏసీ కన్వీనర్ కెఎల్ఎన్.రావు, సీపీఐ మండల కార్యదర్శి పాలకూరి బాబు, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు దొడ్డానర్సింహా రావు, చిలకరాజు అజయ్‌కుమార్, బీ జేపీ నాయకులు ఉమామహేశ్వరరావు, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు మేకల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
అయినా అధికారులు వినకపోవడంతో తెలంగాణ వాదులు వేదికపైకి చేరుకొని ఫ్లెక్సీని తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని రచ్చబండ హాల్ నుంచి బయటకు పంపించివేశారు. అయినప్పటికీ తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ముందుకు దూసుకు వచ్చారు. దీంతో చేసేది లేక అధికారులు ముఖ్యమంత్రి ఫొటోకు తెల్ల కాగితాన్ని అంటించి రచ్చబండ ఫ్లెక్సీని తిరిగి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ప్రథమ శత్రువుగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటోను రచ్చబండ కార్యక్రమంలో ఏర్పాటు చేయవద్దన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు పోతున్నట్లు చెప్పారు. అనంతరం * 85లక్షలతో నిర్మించనున్న ఎస్సీ బాలుర హాస్టల్ శంకుస్థాపన శిలాఫలకా న్ని మంత్రి సభలోనే ప్రార ంభించారు.
పథకాలు వినియోగించుకోవాలి
ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిరంజీవులు కోరారు. అనంతరం వివి ధ పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కలెక్టర్, మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శరత్‌బాబు, ఈఈ చంద్రశేఖర్, స్పెషల్ ఆఫీసర్ వీరారెడ్డి, తహసీల్దార్ దామోదర్‌రావు, ఎంపీడీఓ వెంకటరెడ్డి, నగరపంచాయతీ కమిషనర్ రాంరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ వెంకటరెడ్డి, ఏపీఎస్ఐడీసీ డెరైక్టర్ సాములశివారెడ్డి, రచ్చబండ నిర్వాహణ కమిటీ సభ్యులు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.