ఒంటరి పోరాటం
ఫొటో స్టోరీ
పాతికమందికి పైగా పురుషులు. ఒక్కగానొక్క స్త్రీ. అంతమందినీ తానొక్కతే ఎదుర్కోవాలని చూస్తోంది. శక్తినంతా ఒడ్డి, ప్రాణాలకుతెగించి పోరాడుతోంది. ఎందుకు? దేనికోసం? ప్రపంచమంతా అవాక్కయి చూసిన ఈ చిత్రం... ఏ సంఘటనకు సాక్ష్యం?! అది 2006. ఇజ్రాయెల్ ప్రభుత్వం అధికారులకు ఆజ్ఞలు జారీ చేసింది. దేశంలో అక్రమంగా నివాసముంటున్న వారందరినీ వెళ్లగొట్టమంది. దాంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమైపోయారు. అక్రమ నివాసాలను తొలగించడం మొదలుపెట్టారు. నివాసితులను వెళ్లగొట్టసాగారు. అధికారుల అజమాయిషీలు, అమాయకుల ఆర్తనాదాలతో దేశం అట్టుడికిపోయింది.
ఆ సందర్భంలోనే ఓ ప్రదేశంలో అక్రమ నివాసాలను తొలగించేందుకు పూనుకున్న అధికా రులకూ, అక్కడి ప్రజలకూ మధ్య వాగ్వాదం చెల రేగింది. కాసేపటికి అది హింసాత్మకంగా మారింది. సైన్యం రంగంలోకి దిగి, గొడవను అణిచేందుకు ప్రయ త్నించింది. దాంతో అందరూ భయపడి వెళ్లిపోయినా, యెనెత్ నిలీ అనే ఈ పదహారేళ్ల యూదు యువతి మాత్రం వెళ్లడానికి ఇష్టపడలేదు. ఎందుకు వెళ్లాలంటూ ఎదురు ప్రశ్నించింది. తనను తరిమేయాలని చూసిన సైన్యం మీద తిరగబడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్ ఆడెడ్ బాలిల్టీ ఆ యువతి ఒంటరి పోరాటాన్ని తన కెమెరాలో బంధించాడు.
ఈ ఫొటో పెద్ద దుమారమే లేపింది. ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందంటూ ప్రపంచమంతా విమర్శించింది. అలాంటిదేం లేదంటూ ఆ దేశాధ్యక్షుడు ఎంతగా చెప్పినా నాటి పాలనపై ఇదొక మచ్చగా మిగి లింది. ఆ మచ్చకు శాశ్వత సాక్ష్యంగా నిలిచిన ఈ చిత్రం బాలిల్టీకి పులిట్జర్ బహుమతిని తెచ్చిపెట్టింది.