మేఘాలయకు తొలి రైలు
ప్రారంభించిన ప్రధాని.. స్టేషన్లను ప్రైవేటీకరిస్తామని వెల్లడి
గువాహటి: స్వాతంత్య్రానంతరం సుదీర్ఘకాలం తర్వాత ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు శనివారం తొలిసారిగా రైలు వసతి అందుబాటులోకి వచ్చింది. మెందీపతార్-గువహటి ప్యాసింజర్ రైలును ప్రధాని మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు.అలాగే, మిజోరంలోని భైరాబి-సైరంగ్ రైల్వే మార్గాన్ని బ్రాడ్గేజ్కు మార్పు చేసే ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధికి మౌలికవసతులు ఎంతో ముఖ్యమన్నారు.
వందేళ్ల క్రితం రైల్వే వసతులు ఎలా ఉన్నాయో నేడూ అలానే ఉన్నాయని, రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించి, ఆధునీకరించాలని చెప్పారు. స్థలాల ధరలు పెరిగిపోయినందున రైల్వే తన పరిధిలోని స్థలాల్లో లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు నిర్మించేందుకు వీలుగా ప్రైవేటు పార్టీలను అనుమతించి, ఆదాయం పొందాలని సూచించారు. ముందుగా 10 నుంచి 12 స్టేషన్లను ప్రైవేటీకరించి, ఆధునీకరిస్త్తామని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపడతామని తెలిపారు.
జర్నలిస్టులు తేనెటీగల్లా ఉండాలి: మోదీ
జర్నలిస్టులు ఈగల మాదిరిగా కాకుండా తేనెటీగల్లా ఉండాలని, ఒకవైపు తేనెను ఉత్పత్తి చేస్తూనే మరోవైపు పరిశోధన కూడా కొనసాగించాలని మోదీ జర్నలిస్టులకు సూచించారు. గువాహటీలో ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ద అస్సాం ట్రైబ్యూట్’ ప్లాటినం జూబ్లీ వేడుకలను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.